ఏపీలో వర్తమాన, భవిష్యత్ రాజకీయాలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇవి. మాజీ ఎంపీ సెటైరిక్‌గా చెప్పినా.. ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంతో ఘర్షణ వైఖరి కోరుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సైతం బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇక జనసేన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తులో ఉన్నారు జనసేనాని. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఉండవల్లి ఆ సెటైర్లు వేశారు.
వైసీపీకి ఉన్న ఎంపీల సంఖ్య.. బీజేపీదే అన్నది ఉండవల్లి మాట. దానికి కారణాలు లేకపోలేదు. ఈ మూడేళ్ల కాలంలో కేంద్రంలో వచ్చిన అన్ని సంక్షోభాలలోనూ కేంద్రానికి అండగా నిలిచింది వైసీపీ. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వైసీపీకి సహకరిస్తోంది. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఇతర కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇస్తారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి.. ఏపీకి రావాల్సిన నిధులపై సీఎం జగన్ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చారో లెక్కే లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారో ఏమో.. బీజేపీతో ఘర్షణ వైఖరిని మాత్రం ఆశించండం లేదు వైసీపీ నేతలు. ఈ వైఖరి వల్లే .. కేంద్రమంత్రులు సైతం ఏపీ సీఎంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జగన్‌ని మోడీ ఎంత ప్రేమగా చూస్తారో చెప్తారు.
ఆ మధ్య అనంతపురం వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను ఈ కామెంట్స్ ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడినా.. లోగుట్టు బీజేపీతో వైసీపీ వైరం కోరుకోవడం లేదనేది సుస్పష్టం.
2014తో బీజేపీతో కలిసి కాపురం చేసి.. 2018లో విడాకులు ఇచ్చిన టీడీపీ పరిస్థితి కూడా ఇంతే. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు వైఖరి మారిపోయింది. బీజేపీపైకి కాలు దువ్వే సాహసం చేయడం లేదు. పెట్రోధరలు.. నిత్యావసరల ధరలు పెరిగినా.. టీడీపీ రాష్ట్రంలోని వైసీపీని విమర్శిస్తుంది తప్ప.. కేంద్రంలోని బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు టీడీపీ. పోలవరం.. విశాఖ ఉక్కు కర్మాగారాల విషయంలో అధికార వైసీపీని కార్నర్ చేస్తుందే తప్ప… బీజేపీని అంటే మొదటికే మోసం వస్తుందనే భయం టీడీపీ నేతల్లో ఉంది. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఏపీలోని బీజేపీ నేతలు… మరీ ముఖ్యంగా సోము వీర్రాజు వంటి నాయకులు.. చంద్రబాబును, టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సందర్భం వస్తే ఆ విమర్శలను వీర్రాజు రిపీట్ చేస్తున్నారు. కానీ.. టీడీపీ నేతలు బీజేపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం లేదు. రియాక్ట్ అయితే ఇబ్బంది అనుకుంటున్నారో ఏమో.. ఆ విమర్శలు తమ చెవిన పడలేదన్నట్టుగా సైలెంట్ అయిపోతున్నారు.
టీడీపీ మాదిరే 2018లో బీజేపీకి కటీఫ్ చెప్పిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. అప్పట్లో కమలనాథులను తీవ్రస్థాయిలో విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత వైఖరి మార్చుకుని బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టేసుకున్నారు. గతంలోలా బీజేపీని విమర్శించే పరిస్థితి లేదు. పైగా టీడీపీకి కన్నుగీటుతూ విపక్ష ఓటును చీలనివ్వబోనని చెబుతూనే.. బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు జనసేనాని.
ఈ విమర్శలు.. రాజకీయ ఎత్తుగడలు చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవు. కానీ.. వైసీపీపై టీడీపీ, జనసేన, అప్పుడప్పుడు బీజేపీ విమర్శల దాడి చేస్తుంటాయి. టీడీపీ, జనసేనలపై అధికార వైసీపీ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడతాయి. ఒకరినొకరు తీవ్రంగా తిట్టుకుంటారు నాయకులు. కానీ.. ఎవరూ బీజేపీని తిట్టరు. ఇందులో ఇదే సీక్రెట్. రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి వైసీపీ, టీడీపీలను పిలవలేదు. అంటే బీజేపీపట్ల ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై మమత అండ్ కోకు ఒక అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా.. ఏపీలోని అందరి పిలకలు బీజేపీ చేతిలో ఉన్నాయనేది సుస్పష్టం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా.. జనసేన కూటమి పవర్‌లోకి వచ్చినా కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందే. ఇందుకు ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి.