తెలుగు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టిందా? ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారా? బీజేపీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయి?
సర్వే పేరుతో నేరుగా రంగంలోకి మోడీ!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి చివరిక్షణాల్లో పార్టీల వడపోతలు కామన్. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ చేసింది కూడా ఇదే. ఇప్పుడు మాత్రం బీజేపీ ఢిల్లీ నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ముందుగానే జాతీయ నాయకులు ఎంచుకున్న వ్యూహం పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తోందట. నేరుగా ప్రధాని మోడీనే రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందా అని తమకు పరిచయం ఉన్న ఢిల్లీ వర్గాల దగ్గర ఆరా తీస్తున్నారట కమలనాథులు.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే లక్ష్యమా?
రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు. ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్. లోకల్‌గా పలుకుబడి ఉన్న బీజేపీ నేతలు ఎవరు అనే అంశాలు తెలుసుకునే పనిలో పడ్డారు ప్రధాని మోడీ. నేరుగా మీ అభిప్రాయాలను మోడీతో షేర్ చేసుకోవాలని చెబుతూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీటే ఇప్పుడు బీజేపీ వర్గాల్లో చర్చకు కారణం. ఎమ్మెల్యేల పనితీరు.. రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అవసరం లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే లక్ష్యంగా పొందుపర్చిన సర్వే మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.
నియోజకవర్గాల్లో ముగ్గురు పాపులర్ బీజేపీ నేతలు ఎవరంటూ ఆరా?
నియోజకవర్గంలోని ముగ్గురు పాపులర్ బీజేపీ నేతలు ఎవరు? ఓటు వేసే సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలేంటి? అన్న ప్రశ్నలు అందులో ఉన్నాయి. ఇది కేవలం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే కాకుండా.. సామాన్యుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసే విధంగా సర్వే ప్రక్రియ ఉంది. దీంతో పార్టీతో సంబంధం లేని వారు కూడా సర్వేలో పాల్గొంటారు. పైగా ఈ సర్వేలో గుర్తించిన అంశాలన్నీ ఢిల్లీ నాయకత్వం దగ్గరే ఉంటాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు తెలిసే అవకాశం లేదు. దీంతో తమ ప్రాంతాల నుంచి వెళ్లే సర్వే రిపోర్ట్స్‌పై ఒకింత ఆందోళన కమలనాథుల్లో కనిపిస్తోంది.
సర్వేను దురుపయోగం చేసేవారూ ఉన్నారా?
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక.. పార్టీ ప్రగతికి ఈ సర్వేను ఒక ప్రాతిపదికగా తీసుకుంటే ఇబ్బంది పడేదెవరు అన్నది చర్చగా ఉంది. ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. కొందరు నేతలు ఈ సర్వేను దురుపయోగం చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. తమకు అనుకూలంగా ఎక్కువ మందితో సర్వేలో చెప్పిస్తే ఢిల్లీకి తప్పుడు వివరాలు వెళ్తాయని ఆందోళన చెందుతున్నారట. ముఖ్యంగా టికెట్ ఆశించే నేతలు ఈ తరహా ఎత్తుగడ వేయొచ్చేని సందేహిస్తున్నారు. మరి.. మోడీ నేరుగా డీల్ చేస్తున్న ఈ సర్వే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.