ఉమ్మడి రాష్ట్రంలో భువనగిరి కీలక నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి అడ్డా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత భువనగిరిలో టీఆర్ఎస్‌దే రాజ్యం. వరస ఎన్నికల్లో గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు కంచుకోట నియోజకవర్గాల్లో ఒకటి. కాకపోతే 2018 ఎన్నికల తర్వాత భువనగిరి రాజకీయ ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. భువనగిరిలో పట్టున్న ఎలిమినేటి కుటుంబం టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ఆ కుటుంబానికి అస్సలు పడటం లేదు. ఇంతలో ఎలిమినేటి సందీప్‌రెడ్డికి జడ్పీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో గ్రూపు రాజకీయాల హీట్ మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం భువనగిరిలో పట్టుకోసం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రొటోకాల్ రగడ రచ్చ రచ్చ అవుతోంది. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో సందీప్‌రెడ్డికి ప్రొటోకాల్ పాటించడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య వలిగొండ మండలంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమాచారం సందీప్‌రెడ్డికి లేదట. ఇదంతా కావాలనే చేశారని భావించిన సందీప్‌రెడ్డి మిగతా కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీనిపై గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది.
తాజాగా భువనగిరి మోడ్రన్ రైతుబజారు ప్రారంభోత్సవ కార్యక్రమంలోను జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగ వేదికపైనే వెళ్లగక్కారు. ప్రొటోకాల్ పాటించడంలేదని, కనీసం జిల్లా మంత్రికి చెప్పకుండా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో శేఖర్‌రెడ్డి వర్గం కుతకుత లాడుతోందట. సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. సరైన టైమ్‌లో కౌంటర్ ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం భువనగరిలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా సందీప్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఒకవైపు.. మరో నేత చింతల వెంకటేశ్వరరెడ్డి మరోవైపు ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారు. జిల్లా టీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న ఒక నాయకుడు ఇక్కడ వర్గపోరును ప్రోత్సహిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. దాంతో గ్రూపు రాజకీయాన్ని రోడ్డెక్కించడానికి వెనకాడటం లేదు నాయకులు. అందుకే ఎన్నికల నాటికి ఈ పంచాయితీలు శ్రుతి మించుతాయని ఆందోళన చెందుతోందట కేడర్.