Off The Record : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. ఇంకా నోటిఫికేషన్ రాకుండానే రకరకాల ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్‌తో రచ్చ మొదలైపోతోంది. ముఖ్యంగా అధికార కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కాక రేపుతోందంటున్నారు. జనసేన, బీజేపీ మేజర్ మేయర్ సీట్ల మీద కన్నేయడంతోపాటు టీడీపీతో ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో… మిత్ర పక్షాలు రెండూ ఎందుకింత ధైర్యం చేస్తున్నాయి? వెనకున్న కారణాలు ఏంటంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టి చర్చే జరుగుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో… కార్పొరేషన్లకు సంబంధించి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఏలూరు లాంటి కీలక స్థానాలను జనసేన అడుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణం… ఈ మూడు ముఖ్యమైన నగరాల మేయర్ సీట్లు కోరుతోందట. కూటమిగా ఉన్నప్పుడు సాధారణంగా ఇలాంటి వాటన్నిటినీ చర్చల తర్వాత డిసైడ్ చేయాలి. కానీ, ప్రస్తుతం బీజేపీ, జనసేన వైఖరి చూస్తుంటే… ఆ రెండు పార్టీలు ఆల్రెడీ డిసైడైనట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అటు కూటమి వర్గాల్లో కూడా ఇప్పుడు దీని గురించే హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయంటున్నారు.
కీలక ఎన్నికల్లో మిత్ర పక్షాల మధ్య సమన్వయం ముఖ్యం. కానీ… ఇక్కడ అలాంటిది కనిపించడం లేదని, కీలకమైన సీట్ల మీద కన్నేసిన జనసేన, బీజేపీ వాళ్ళంతట వాళ్ళే మేం పోటీ చేస్తాం అని ఫిక్స్ అవడం ఏంటో అర్ధంకావడం లేదని తెలుగు తమ్ముళ్ళు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొందరు మాత్రం… ముందే తొందర ఎందుకు? పెద్దోళ్ళని మాట్లాడుకోనివ్వండని అంటున్నారట. అదే సమయంలో 2024 సాధారణ ఎన్నికలకు, ప్రస్తుతానికి పోల్చుకుంటే…. జనసేన. బీజేపీ వైఖరిలో చాలా తేడా వచ్చిందన్న వాదన సైతం ఉంది. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో చాలా చోట్ల ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తి రావటం, స్వయంగా సీఎం చంద్రబాబు సైతం వాళ్ళ పనితీరు మీద విమర్శలు చేయడం, కొంతమంది మంత్రుల విషయంలో కూడా విమర్శలు పెరగడం లాంటివన్నీ ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. విమర్శలు, ఆరోపణలు కొద్ది మంది వ్యక్తులను ఉద్దేశించి చేస్తున్నా…అవి ఓవరాల్‌గా కూటమి, ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తున్నాయన్న అంచనాలున్నాయి. ఈ పరిణామాలతోనే… టీడీపీ మిత్రపక్షాలు రెండిటి బార్గెయినింగ్ కెపాసిటీ పెరిగిందన్న చర్చలు ఉన్నాయి. అదే సమయంలో ప్రధాన నగరాల్లో మేం సొంతగా బలపడకుంటే ఎలాగన్న ఆలోచన కూడా బీజేపీ, జనసేనను ప్రభావితం చేస్తున్నాయంటున్నారు.
రాజధాని ప్రాంతంలో ఉండే గుంటూరు, విజయవాడ, ఏలూరులో పోటీ చెయ్యాలన్న నిర్ణయానికి కారణం కూడా అదే అయి ఉండవచ్చన్నది రాజకీయవర్గాల అంచనా. మిత్రపక్షాలు అడుగుతున్న వాటిలో మెజారిటీ నగరాలు టీడీపీకి కంచుకోటలు కావడంతో… ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. పెద్ద నగరాలు, బలమైన సీట్లు అడగడం ద్వారా… కూటమిలో ప్రస్తుతం టిడిపి ఎలా ఉందో… మేం కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నామని మెసేజ్ పంపే ఉద్దేశ్యం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. మేం ఎక్కడా తగ్గలేదని చెప్పుకోవడం, తమ కేడర్‌కు బలమైన సంకేతాలు ఇవ్వడమన్న రకరకాల లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయట. ఇప్పుడు కీలకమైన స్థానాల్లో పోటీ చేసి గెలిస్తే…. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చన్న లెక్కలు కూడా ఉన్నాయట. మొత్తం 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే… అందులో సగానికి సగం బీజేపీ, జనసేన అడుగుతున్నాయి. పైగా కీలకమైన, టీడీపీకి కంచుకోటల్లాంటి నగరాల మేయర్ సీట్లను కోరుకోవడంతో టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇక కేవలం కార్పొరేషన్స్‌కే పరిమితం అవకుండా…మున్సిపాలిటీల్లో కూడా సేమ్ ఫార్ములా అప్లయ్ చేయాలని అనుకుంటున్నారట జనసేన, బీజేపీ నేతలు. తెలుగుదేశం పార్టీకి 80 శాతం, జనసేన15, బీజేపీకి ఐదు శాతం రేషియోలో సీట్ల సర్దుబాటు ఉంటాయని ఇప్పటిదాకా అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే… ఈ లెక్కలు…బాగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి రాజకీయవర్గాలు. ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి పెరగడం, వాళ్ళని సీఎం చంద్రబాబు పదేపదే తిట్టటం, రాజధాని ప్రాంతంలో పట్టు పెంచుకోవడం, ప్రధాన నగరాల్లో పాగా వేయడం లాంటి చాలా లెక్కలతో జనసేన, బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల లెక్కలు ప్రస్తుతానికి వర్తించబోవని జనసేన ఇప్పటికే చెప్పేసింది. తమకు బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేసి తీరుతామన్న వాళ్ళ వైఖరిగా తెలుస్తోంది. ఈ రకంగా మిత్రపక్షాలు రెండూ టీడీపీ కంచుకోటలపై కన్నేసి… తమకు అనుకూల లెక్కలు చెబుతుండటంతో… సర్దుబాటు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.

