Anil Kumara Yadav : Who leaked the audio of the former minister?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అప్పు చేయకపోయినా.. లోన్ యాప్ ఏజెంట్ల ఫోన్ వేధింపులకు బాధితుడిగా నిలిచారు. ఆయన ఫోన్ ఆడియో సంభాషణ బయటకు రావడంతో పెను సంచలనంగా మారింది. అయితే ఇదే అంశం వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి ఫోన్ ఆడియో ఎలా లీకైంది? పోలీసుల దగ్గర నుంచి ఎలా బయటకు వచ్చింది? ఎవరి ఆదేశాలు పనిచేశాయి? అనే ప్రశ్నల చుట్టూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సమస్య తాడేపల్లి వరకు వెళ్లడంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
లోన్ యాప్ సంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఎలా ఉంటాయనేదానికి అద్దంపట్టే సంభాషణ ఇది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను పదే పదే ఫోన్‌లో వేధించడం సంచలనంగా మారింది. ఆ విషయాన్ని మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా అనిల్ అండ్ కో జాగ్రత్త పడింది. కానీ.. బయటకు రావడంతో కలకలం రేగింది. అనిల్ శిబిరానికి మాత్రం ఆ ఆడియో లీకేజీ పెద్ద షాకే ఇచ్చిందట. ఇది ఎలా జరిగింది? మీడియాకు ఎవరు ఇచ్చారు? అని ఆరా తీస్తున్నారట. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలతో ఉన్న వర్గపోరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పైగా ఈ సమస్య తాడేపల్లి వరకు వెళ్లడం పార్టీ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
లోన్ యాప్ ఏజెంట్ల నుంచి అనిల్‌తోపాటు మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి కూడా ఇలాగే ఫోన్లు వచ్చాయి. ఆ కాల్స్ మంత్రి పీఏ రిసీవ్ చేసుకున్నారు. దానిపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి కాకాణి ఫోన్ ఆడియో సంభాషణ బయటకు రాకపోవడం.. తన కాల్ రికార్డింగ్స్ మాత్రమే లీక్ కావడంతో దాల్‌మే కుచ్ కాలాహై అని మాజీ మంత్రి అనిల్ సందేహిస్తున్నారట. తన ఆడియో ఎందుకు బయటకొచ్చిందన్నదే మాజీ మంత్రి ఆవేదన. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గాల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తాడేపల్లికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి ఆడియో లీకేజీపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. మాజీ మంత్రి అనిల్ లోన్ యాప్ దగ్గర అప్పు చేయలేదు. తప్పు అనిల్‌ది కాదు. ఆ లోన్ యాప్‌తోనూ సంబంధం లేదు. వాళ్లే ఆయనకు ఫోన్ చేసి వేధించారు. అనిల్ ఫిర్యాదుతో లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ల నుంచి ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. వాటిల్లోనే ఫోన్ వాయిస్ ఉందట. మరి.. పోలీసుల దగ్గరున్న వాయిస్ ఎలా బయటకు వచ్చిందన్నదే అనిల్ అండ్ కో ప్రశ్న. ఎవరి ఆదేశాలతో బయటకు వచ్చింది? అనే క్రమంలో జిల్లా మంత్రి పాత్రపై అనిల్ వర్గం ఆరోపిస్తోంది.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. మంత్రివర్గంలో చోటు కోల్పోయిన అనిల్ అసంతృప్తితో ఉన్నారు. కాకాణి గోవర్దన్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవడంతో మరింత చిటపటలాడుతున్నారు. రెండు వర్గాల మధ్య అస్సలు పొసగడం లేదు. ఉప్పు నిప్పులా ఉంది సమస్య. మంత్రి హోదాలో తొలిసారి కాకాణి నెల్లూరు జిల్లాకు వచ్చిన రోజే.. తన నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించారు అనిల్. ఆ సభతో మంత్రి కాకాణి పట్ల తన వైఖరి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. దాంతో ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నించారు వైసీపీ పెద్దలు. ఆ తర్వాత అనిల్ ఇంటికి వెళ్లారు మంత్రి కాకాణి. ఎదురు పడినప్పుడు నవ్వుకున్నారే తప్ప నొసటితో వెక్కిరించుకున్నారని చెబుతారు. చేతులు కలిశాయి కానీ.. చేతలు కలవలేదు. ఇప్పుడీ ఫోన్ ఆడియో లీకేజీ ఎపిసోడ్ వారి మధ్య వైరాన్ని తారాస్థాయికి తీసుకెళ్లినట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఈ సమస్య తాడేపల్లిలోని పార్టీ పెద్దల దగ్గరకు చేరడంతో.. మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి చర్చల్లోకి వస్తున్నాయి. కాకాణి వర్గం పిన్ డ్రాప్ సైలెన్స్‌లో ఉంటే.. అనిల్ శిబిరం మాత్రం కుతకుతలాడుతోంది. అందుకే ఫోన్ ఆడియో లీకేజీపై వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తానికి లోన్ యాప్ ఏజెంట్ల ఫోన్ వేధింపుల కంటే.. వైసీపీలో వైరివర్గాల ఎత్తుగడలు మరింత రంజుగా మారాయి. మరి.. ఈ ఎపిసోడ్‌కు ఎలాంటి ఎండ్‌కార్డు పడుతుందో చూడాలి.