Amith Shah Munugode Meeting :అమిత్ షా సభలో చాలామంది బీజేపీలో చేరతారని ఊదరగొట్టారు కమలనాథులు. కానీ.. సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే కాషాయ కండువా కప్పుకొన్నారు. మరి.. షా సమక్షంలో బీజేపీలో చేరాలని ఆశించిన వారికి ఎవరు బ్రేక్ వేశారు? వారు ఎందుకు చేరలేదు? బీజేపీ ఏం చెబుతోంది?
బీజేపీలో చేరికలకు టైమ్ దగ్గర పడిందని.. వివిధ పార్టీల నుంచి వెల్లువలా వస్తారని కొంతకాలంగా కమలనాథులు ఊదరగొడుతున్నారు. రకరకాల పేర్లూ చర్చల్లోకి వస్తున్నాయి. అమిత్ షా సమక్షంలో చాలా మంది బీజేపీలో జాయిన్ అవుతారని భావించారు కూడా. సహజంగా బీజేపీలో చేరాలని అనుకున్నవాళ్లు అమిత్ షా చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకోవాలని ఆశిస్తారు. దానికి తగ్గట్టుగానే మునుగోడు సభకు షా రావడంతో బీజేపీలో చేరిపోదామని అనుకున్నారట. కానీ.. మునుగోడు సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే బీజేపీలో చేరారు. దీంతో ఏం జరిగింది? చేరికలకు ఎక్కడ బ్రేక్ పడింది? ఎవరైనా అడ్డుకున్నారా? పార్టీ మారతారని ప్రచారంలో ఉన్నవాళ్లు ఎందుకు చేరలేదు అని ప్రశ్నలు సంధిస్తున్నారు కొందరు.
మునుగోడు సమరభేరి సభ ఉద్దేశం వేరని.. అక్కడ ఉపఎన్నిక ఉండటంతో ఇతర నేతలను చేర్చుకునే ప్రక్రియను ఆపారని పార్టీ వర్గాల వాదన. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం రాజగోపాల్‌రెడ్డి మాత్రమే బీజేపీలో చేరాలా ప్లాన్ మార్చారట. అప్పుడే అమిత్ షా టూర్ మునుగోడులో హైలైట్ అవుతుందని.. దానిపైనే చర్చ జరగుతుందని అభిప్రాయపడ్డారట. ఇతర ప్రాంతాల నేతలు మునుగోడు సభలో బీజేపీలో చేరితే చర్చ పక్కకెళ్లే ప్రమాదం ఉందని భావించారట.
వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. హుస్నాబాద్‌కు చెందిన బొమ్మ శ్రీరామ్ తదితరుల అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని ప్రచారం చేశారు. అది జరగకపోవడంతో.. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారని.. ఆసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని.. అప్పుడు చేరికలు ఉంటాయని చెబుతున్నారు. కీలక నాయకులను పక్కన పెడితే.. కనీసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు.. ఆయన అనచరులు.. మునుగోడుకు చెందిన ఇతర పార్టీ నేతలు వేదికపై బీజేపీ కండువా కప్పుకొని ఉంటే మరోలా ఉండేదని లెక్కలేస్తున్నారట.
మునుగోడుకు చెందిన కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులను బీజేపీ చేర్చుకుంది. అయితే వారిపై పాత కేసులు తిరగదోడటంతో.. బీజేపీ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. వారిని ఇప్పుడే తెరపైకి తీసుకొస్తే ఇబ్బందులు వస్తాయని.. ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉంచి రాజకీయం చేయాలని.. వారితోనే తదుపరి కార్యాచరణ నడిపించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ వ్యూహం బీజేపీకి కలిసి వస్తుందా? అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాలని ఆశించి.. భంగపడినవారిని బుజ్జగించారా? మునుగోడు వ్యూహం వర్కవుట్ అవుతుందో లేదో కాలమే చెప్పాలి.