Amit Shah Meets Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా ఎందుకు కలిశారో ఏమో.. అప్పటి నుంచి ఏపీ బీజేపీ నేతలు ఆయన నామస్మరణే చేస్తున్నారు. సందర్భం ఏదైనా సరే.. జూనియర్ పేరునే ప్రస్తావిస్తున్నారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్ పేరును కలవరించే కమలనాథులు ఇప్పుడు జూనియర్ వెంట పడటం ఆసక్తికరంగా మారింది.
గత నెల 21న మునుగోడు బహిరంగ సభకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పటి వరకు బీజేపీతో కానీ బీజేపీ నేతలతో కానీ ఎటువంటి సంబంధాలులేని జూనియర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ అమిత్ షా కలవడంపై ఇప్పటికీ రకరకాల విశ్లేషణలు నడుస్తూనే ఉన్నాయి. షా ఎందుకు జూనియర్ ను కలిసారన్నది ఇంత వరకు అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. విషయం ఏదైతేనేమి… పొలిటికల్ మైలేజీని పట్టేయడమే ముఖ్యం అనుకున్నట్టున్న నాయకులంతా జూనియర్ జపం చేస్తున్నారు.
ఎందుకు కలిసారన్న సంగతి అటుంచితే.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడాలేని అభిమానం, ఆప్యాయత, ప్రేమ కురిపిస్తున్నారు. ఇలా చేయడానికి వాళ్లు సమయం సందర్భం కూడా చూసుకోవడం లేదు. విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవం జరిగింది. అందులో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. గురువుల గొప్పతనాన్ని వివరించడానికి ఆయన ఏం చేశారో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన నేర్చుకున్న భరతనాట్యాన్ని.. ఆయన బాల నటుడిగా నటించిన బాల రామాయణాన్ని ఉదాహరణగా చెప్పారు వీర్రాజు.
రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టిన సోము వీర్రాజు అక్కడా జూనియర్ ప్రస్తావన తెచ్చారు. పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెబుతూనే.. ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకుంటామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్.
సోము వీర్రాజే కాదు… బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా ఇదే లైన్‌లో ఉన్నారు. వీర్రాజు చేసిన కామెంట్స్‌తో విభేదించలేదు.. అవుననీ చెప్పలేదు. కానీ కమలనాథుల శ్రుతి మాత్రం ఒకే ట్యూన్‌లో ఉంది.
ఏపీలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఏం అన్నా.. బీజేపీ నేతలు ఆయన చుట్టే తిరుగుతూ ఆయన పేరే ప్రస్తావిస్తూ ఉంటారు. ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పవన్ అంటే… టీడీపీతో కుదరబోదని బీజేపీ నేతలు చెబుతారు. కానీ పవన్‌ను ఏం అనే వాళ్లు కాదు. ఈ మధ్య బీజేపీ నేతల మనసు జూనియర్ ఎన్టీఆర్ వైపు మళ్లినట్టుంది. పవన్‌ను వదలిలేసి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్ మనసులో ఏం ఉందో ఏమో.. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం ఆయన్ను.. ఆయన పేరును వాడేస్తున్నారు.