మున్నూరు రవికి ప్లీనర్ ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చారు? మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన కేసులో కీలక నిందితుడు. అలాంటి వ్యక్తి టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ పండక్కి వెళ్లాలని ఎంతోమంది గులాబీ కార్యకర్తలు ప్రయత్నించినా.. నియోజకవర్గాల నుంచి కొందరినే ఎంపిక చేశారు. వారికే ఆహ్వానాలు వెళ్లాయి. ఎమ్మెల్యేలు పంపిన జాబితాను వడపోసి.. లిమిటెడ్‌గానే ఇన్విటేషన్లు పంపారు నేతలు. ప్లీనరీకి వచ్చేవాళ్లకు బార్‌కోడ్‌తో కూడిన పాస్‌లు ఇచ్చారు. ప్లీనరీ ప్రాంగణంతోపాటు.. ప్లీనరీ హాల్‌లోకి వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక మంత్రి హత్యకు కుట్ర చేసిన కేసులో నిందితుడు మున్నూరు రవి ఎలా ఎంట్రీ ఇచ్చారన్నదే ప్రస్తుతం ప్రశ్న. ప్లీనరీకి రావడంతోపాటు.. అక్కడ కలియ తిరగడం.. పోలీసులు, ఇతర అధికారులతో రవి ఫొటోలు దిగడం.. అవి సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ మున్నూరు రవిని ఎవరు తీసుకొచ్చారు. బార్ కోడ్‌తో కూడిన పాస్ ఎలా వచ్చిందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన రవికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లీనరీ పాస్ ఇచ్చే ప్రసక్తే లేదు. అయితే పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్లీనరీ పాస్‌లను రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పర్యవేక్షించారు. తాజా ఘటన తర్వాత మున్నూరు రవికి శ్రీధర్‌రెడ్డే పాస్ ఇచ్చారనే ప్రచారం ఊపందుకుంది. ప్లీనరీలో మున్నూరు రవి ఎపిసోడ్ చర్చగా మారిన తర్వాత సభా ప్రాంగణం నుంచి శ్రీధర్‌రెడ్డి ఎస్కేప్ అయినట్టు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మున్నూరు రవి పాత్ర తెలిసే శ్రీధర్ రెడ్డి పాస్ ఇచ్చారా.. లేక ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఇచ్చారా అనేది ప్రస్తుతం గులాబీ వర్గాల్లో చర్చ. మున్నూరు రవితో ఉన్న పాత పరిచయాలతోనే శ్రీధర్‌రెడ్డి పాస్ ఇచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారట.
మున్నూరు రవి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ప్రతీవారం పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తి ప్లీనరీకి రావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శిబిరం కూడా ఆరా తీస్తోందట. ప్లీనరీలో రవి దిగిన పోస్టులు వైరల్ కావడంతో.. వాటిని అతను తొలగించినట్టు తెలుస్తోంది. ఎవరైతే ప్లీనరీ పాస్‌లు ఇచ్చారో ఆ నాయకుడే అతనితో ఆ ఫొటోలు డిలీట్ చేయించారని ప్రచారం జరుగుతోంది. అయితే మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న తాను ప్లీనరీకి వెళ్తే తప్పేముందని పార్టీ వర్గాల దగ్గర ప్రశ్నిస్తున్నాడట. మరి.. ఈ ఎపిసోడ్‌లో పార్టీ ఎలాంటి నిర్ణయానికి వస్తుందో.. ఎవరిపై చర్యలు ఉంటాయో చూడాలి.