రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు చాలామందికి అదనపు ఆదాయం కాదు. అదే జీవనాధారం. బ్యాంక్‌లో వేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే మందులు కొనాలి, కిరాణా సరుకులు తీసుకోవాలి, ఇంటి రోజువారీ ఖర్చులు చూసుకోవాలి. కానీ ఇలాంటి వడ్డీ ఆదాయంపై ఇచ్చే పన్ను రాయితీలు సంవత్సరాలుగా మారలేదు.
మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ 2026 ఈ సమస్యకు సమాధానం ఇస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. వడ్డీ ఆదాయాన్ని లగ్జరీలా కాకుండా భద్రతగా చూసే విధంగా పన్ను నిబంధనలు మారతాయా? రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా జీవించే అవకాశాన్ని ఈ బడ్జెట్ ఇస్తుందా?
సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇప్పటి ట్యాక్స్ రూల్స్‌ని చూడాలి. పాత ట్యాక్స్ విధానంలో 60 ఏళ్లలోపు వారికి సేవింగ్స్ అకౌంట్‌పై వచ్చే వడ్డీకి సెక్షన్ 80TTA కింద గరిష్టంగా 10 వేల రూపాయల వరకే మినహాయింపు ఉంది. సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80TTB కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై కలిపి గరిష్టంగా 50 వేల రూపాయల వరకే పన్ను మినహాయింపు ఇస్తున్నారు.
ఈ పరిమితులు కొత్తవి కావు. చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించినవి. అప్పటితో పోలిస్తే ఈ రోజు జీవన వ్యయం పూర్తిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం సగటున 5 నుంచి 6 శాతం మధ్యే ఉంది. కానీ వైద్య ఖర్చులు మాత్రం దాని కంటే వేగంగా పెరుగుతున్నాయి. రిటైర్డ్ వ్యక్తికి పెద్ద పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ రిస్కులు తీసుకునే అవకాశం ఉండదు. అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లే భద్రమైన ఆధారం. కానీ అదే వడ్డీ ఆదాయంపై పన్ను భారం పెరిగితే చేతికి మిగిలేది మరింత తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలకు సరిపడే వడ్డీ, ఇప్పుడు మందుల ఖర్చులకే సరిపోని పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తోంది.
ఇక్కడే ట్యాక్స్ నిపుణులు ఒక కీలక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది కొత్త రాయితీ కాదు. కోల్పోయిన కొనుగోలు శక్తిని తిరిగి ఇవ్వడమే లక్ష్యం. అందుకే సేవింగ్స్ అకౌంట్ వడ్డీపై మినహాయింపును 10 వేల నుంచి కనీసం 20 వేల రూపాయలకు పెంచాలని, సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై మినహాయింపును 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని సూచిస్తున్నారు. దీని వల్ల పెద్ద పెట్టుబడిదారులకు లాభం కాదు. రోజువారీ ఖర్చుల కోసం వడ్డీపై ఆధారపడే రిటైర్డ్ వర్గానికి మాత్రమే ఊరట. ఇంకో ముఖ్యమైన వర్గం ఉంది. సీనియర్ సిటిజన్లు కాకపోయినా, చాలా మధ్యతరగతి కుటుంబాలు ఫిక్స్‌డ్ డిపాజిట్లనే భద్రతగా చూస్తాయి. కానీ ఈ వర్గానికి FD వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపూ లేదు. రిస్క్ తీసుకోలేని స్మాల్ సేవర్స్‌కు కనీస స్థాయి డిడక్షన్ ఇచ్చినా, అది పెద్ద భారం కాకుండా ప్రభుత్వానికి కూడా, ఊరటగా ప్రజలకు కూడా మారుతుందని నిపుణుల అభిప్రాయం.
ఇటు కొత్త ట్యాక్స్ విధానం విషయానికి వస్తే, అది సింపుల్‌గా ఉన్నా సీనియర్ సిటిజన్లకు పెద్దగా ఉపయోగపడటం లేదు. ఎక్కువమంది రిటైర్డ్ వ్యక్తులు కష్టంగా ఉండే ట్యాక్స్ ప్లానింగ్ చేయరు. వడ్డీ ఆదాయమే వారి ప్రధాన ఆధారం. అలాంటి వారికి కొత్త విధానంలో కూడా చిన్న మినహాయింపు ఇస్తే, ఆ విధానం మరింత న్యాయంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బడ్జెట్ 2026 ముందు చర్చలో ఉన్న అసలు ప్రశ్న ఇదే.
వడ్డీ ఆదాయాన్ని అదనపు సంపాదనలా చూడాలా? లేదా జీవన భద్రతగా గుర్తించాలా? సీనియర్ సిటిజన్లకు ఇది లగ్జరీ కాదు. అది గౌరవంగా బతకడానికి అవసరమైన ఆధారం. ఈ వాస్తవాన్ని పన్ను విధానాలు గుర్తిస్తేనే రిటైర్మెంట్ తర్వాత జీవితం నిజంగా సురక్షితంగా మారుతుంది.
ALSO READ: మహిళలకు గుడ్‌న్యూస్..! బడ్జెట్‌లో కొత్త స్కీములు..? పూర్తి డీటెయిల్స్ ఇవే!