అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
భారత్‌పై ట్రంప్ సుంకాలు..!
ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న భారత్ పై సుంకాల ప్రభావం ఎంతమేర ఉంటుందనేది అంచనాకు అందట్లేదు. ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 25శాతం సుంకం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అంతకుముందు ఏప్రిల్ లో విధించిన 25శాతం సుంకానికి ఇది అదనం. దీంతో మొత్తం సుంకం 50శాతానికి చేరింది. ఈ సుంకాలు ప్రధానంగా దుస్తులు, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామగ్రి తదితర సామాగ్రిపై విధించారు. ఔషధాలు, సెమీకండక్టర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంధన ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చారు. ఆపిల్, ఫైజర్ వంటి కంపెనీలకు ఇది ఊరట కలిగిస్తోంది. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మిత్రుడికి ట్రంప్ ద్రోహం..!
భారత్ అమెరికాకు మిత్రదేశంగా ఉంది. ట్రంప్ – మోడీ మధ్య మంచి స్నేహం ఉంది. అయినా భారత్ పై భారీ సుంకాలు విధించారు ట్రంప్. అసలు ట్రంప్ భారత్ ను ఎందుకు టార్గెట్ చేశారు..? ట్రంప్ సుంకాల వెనుక ప్రధాన కారణం రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడమే. 2025 జనవరి-జూన్ మధ్య భారత్ రోజుకు సగటున 1.75 మిలియన్ బారెల్స్ చమురును రష్యా నుంచి దిగుమతి చేసింది. ఇది మన చమురు అవసరాల్లో దాదాపు 40శాతం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోప్.. రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ ఈ ఆంక్షలను లెక్కచేయకుండా చమురు కొనడం వల్ల రష్యా ఆర్థికంగా బలపడుతోందని, ఇది ఉక్రెయిన్ పై యుద్ధానికి దోహదం చేస్తోందనేది ట్రంప్ ఆరోపణ. అంతేకాక, ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానంలో భాగంగా వాణిజ్య లోటును తగ్గించాలని భావిస్తున్నారు. 2024లో అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం 190 బిలియన్ డాలర్లు ఉండగా, అమెరికా 45.8 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ఎదుర్కొంది. భారత్‌లోని అధిక సుంకాలు, డైరీ, పౌల్ట్రీ, జన్యు మార్పిడి ఉత్పత్తులపై ఆంక్షలు.. అమెరికా ఎగుమతులకు ఆటంకంగా మారాయి. ఇది ట్రంప్ కు నచ్చట్లేదు. భారత్‌ను “టారిఫ్ కింగ్” అని పిలిచిన ట్రంప్, ఈ సుంకాల ద్వారా భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చి రాయితీలు రాబట్టుకోవాలని చూస్తున్నారు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే నానుడి మనకు తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. మోడీతో ఎంత స్నేహం ఉన్నా దేశం విషయంలో తగ్గేదే లేదంటున్నారు.
రష్యా నుంచి చమురు కొంటే ట్రంప్‌కు నొప్పేంటి?
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే అమెరికా కలిగే నొప్పేంటి అనేది చాలా మందికి ఉన్న సందేహం. అయితే దీని వెనుక అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. ఇది అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. రష్యా బలోపేతం కావడం అమెరికాకు స్వతహాగా నచ్చదు. పైగా ఈ నిధులతో తమ మిత్రదేశమైన ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది. ఒకవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించి కట్టడి చేస్తున్నాయి. అదే సమయంలో భారత్ మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి ఆ దేశానికి మేలు చేస్తోంది. అంతేకాక, భారత్ బ్రిక్స్ కూటమిలో రష్యా, చైనాతో కలిసి పనిచేస్తోంది. అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆలోచిస్తోంది. ఇవన్నీ అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నాయి. ఒకవేళ బ్రిక్స్ కూటమి బలపడితే, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో అమెరికా నియంత్రణ తగ్గిపోతుంది. డాలర్ విలువపై ఒత్తిడి పెరగుతుంది. ఇవన్నీ ట్రంప్ కు అస్సలు నచ్చట్లేదు.
ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్..!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్… మరోవైపు రష్యాతో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇది ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్ ను తెలియజేస్తోంది. 2024లో రష్యా నుంచి అమెరికా 3.3 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం, ఫర్టిలైజర్లు, పల్లాడియం దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి 16.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని యూరోపియన్ యూనియన్ దేశాలు కొనుగోలు చేశాయి. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై మాత్రమే 50శాతం సుంకాలు విధించింది అమెరికా. ఇది అన్యాయమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మా చమురు కొనుగోళ్లు మార్కెట్ ఆధారితమైనవని, 140 కోట్ల మంది ఇంధన భద్రతను కాపాడటం మా బాధ్యత అని భారత్ స్పష్టం చేసింది. అమెరికా, యూరోప్ దేశాలు… రష్యాతో వ్యాపారం చేస్తుంటే, భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని ఆక్షేపించింది. ఈ సుంకాలు WTO నిబంధనలను ఉల్లంఘిస్తాయని, నాన్-డిస్క్రిమినేషన్ సూత్రాలకు విరుద్ధమని నిపుణులు వాదిస్తున్నారు.
మనకో రూల్.. వాళ్లకో రూల్..!!
భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తున్న అమెరికా, ఇతర దేశాల విషయంలో మాత్రం ఇంత కఠినంగా వ్యవహరించట్లేదు. దీన్ని బట్టి కావాలనే భారత్ పై భారీ సుంకాలు విధిస్తున్నట్టు అర్థమవుతోంది. భారత్‌పై 50శాతం, చైనాపై 30శాతం, వియత్నాంపై 20శాతం, యూరోపియన్ యూనియన్ పై 15 శాతం, జపాన్‌పై 15శాతం సుంకాలు విధించింది అమెరికా.! రష్యా నుంచి చైనా 62.6 బిలియన్ డాలర్ల చమురు కొనుగోలు చేసింది. ఇది భారత్ కంటే చాలా ఎక్కువ. అయినా ట్రంప్ మాత్రం భారత్‌పైనే ఎక్కువ సుంకాలు విధించారు. ట్రంప్ ఈ సుంకాలను ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA), ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232 కింద విధించారు. కానీ “జాతీయ భద్రత” కోసం అని సమర్థించుకుంటున్నారు. అయితే, WTO రూలింగ్స్ ప్రకారం, జాతీయ భద్రత ఆధారంగా విధించే సుంకాలు నిజమైన ఎమర్జెన్సీకి సంబంధించినవి కావాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఎంత?
భారత్ ట్రంప్ సుంకాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశంగా ఉంది. భారత్ అమెరికాకు ఏటా 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తోంది. ఇది GDPలో 2% కంటే తక్కువ. 50% సుంకాల వల్ల ఈ ఎగుమతుల డిమాండ్ 40 నుంచి 50% తగ్గవచ్చని, GDP గ్రోత్‌పై 0.6% ప్రభావం పడవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. దుస్తులు, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, ఆటో కాంపోనెంట్స్ రంగాలు అధిక ధరల వల్ల అమెరికా మార్కెట్‌లో పోటీతత్వాన్ని కోల్పోవచ్చు. అదే జరిగితే మన దేశంలో తయారీ రంగం కుంటుపడుతుంది. ప్రముఖ గార్మెంట్ ఎక్స్‌పోర్టర్ పెర్ల్ గ్లోబల్ తమ ఉత్పత్తిని బంగ్లాదేశ్, వియత్నాంలకు మార్చాలని యోచిస్తోంది. ఈ రంగాల్లో MSMEలు, ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
అమెరికాపై భారత్ సుంకాల మాటేంటి?
అమెరికా భారత్ పై సుంకాలు విధిస్తోంది సరే.. మరి అమెరికాపై భారత్ ఎంతమేర సుంకాలు విధిస్తోంది. ప్రతీకార సుంకాలు విధించొచ్చు కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. భారత్ గతంలో అమెరికా నుంచి స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించింది. అయితే, ట్రంప్ 50% సుంకాలతో పోలిస్తే, భారత్ సుంకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. అమెరికా సుంకాలు ఇలాగే కొనసాగితే, భారత్ WTO నిబంధనల కింద అమెరికా దిగుమతులపై అదనపు సుంకాలు విధించే హక్కును కలిగి ఉంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ సుంకాలను అధ్యయనం చేస్తోందని.. రైతులు, MSMEలు, వ్యవసాయ రంగం ప్రయోజనాలను కాపాడుతామని స్పష్టం చేసింది.
రష్యాతో స్నేహంపై ట్రంప్ అక్కసు!
రష్యాతో భారత్ బంధం బలోపేతం అవుతున్నందునే అమెరికా ఓర్చుకోలేకపోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా – భారత్ బంధాన్ని దెబ్బకొట్టడం ద్వారా తానే పెద్ద అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. ట్రంప్ సుంకాలను భారత్ “అన్యాయం, ఆమోదయోగ్యం కాదు” అని ఖండించింది. అంతేకాక, అమెరికా సుంకాలను లెక్క చేయకుండా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 7న మాస్కోలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి సెర్గీ షోయిగుతో భేటీ అయ్యారు. “భారత్-రష్యా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నాయి, దీనిని మేము గొప్పగా, విలువైనవిగా భావిస్తాం,” అని అజిత్ దోవల్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని ఇంటర్‌ఫాక్స్ నివేదించింది.
సుంకాల వల్ల అమెరికాకే నష్టమా..?
అమెరికా సుంకాల ప్రభావం భారత్ పై తాత్కాలికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే వీటిని ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాలు రచిస్తోంది. అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి భారత్ బహుముఖ వ్యూహాలను అవలంబించే అవకాశం కనిపిస్తోంది. అమెరికాపై ఆధారపడకుండా, యూరోప్, ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో ఎగుమతులను విస్తరించడం ద్వారా పట్టు నిలుపుకోవచ్చు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం.. చైనా, బంగ్లాదేశ్‌పై అధిక సుంకాలు విధించడం ద్వారా భారత టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు లబ్ది పొందుతున్నాయి. మరోవైపు అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇక.. అమెరికాతో చర్చల ద్వారా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ నెల చివరలో అమెరికా బృందం భారత్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి, ఎగుమతి ఆధారిత రంగాల్లో స్వావలంబనను పెంచడం ముఖ్యం. ట్రంప్ విధించిన సుంకాలపై న్యాయపోరాటానికి కూడా అవకాశం ఉంది. WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున చట్టపరమైన మార్గాల్లో పోరాడవచ్చు. చివరగా రష్యా, చైనాతో బ్రిక్స్ కూటమిలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం భారత్ ముందున్న మంచి అవకాశం. డాలర్ ఆధారిత వాణిజ్యానికి ప్రత్యామ్నాయ కరెన్సీలను ప్రోత్సహించడం ముఖ్యం. రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపడం కష్టం. అలా చేస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. సామాన్య ప్రజలపై భారం పడుతుంది.
భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటెద్దు పోకడలతో రెచ్చిపోతున్నారు. దీంతో రష్యా, చైనా, భారత్ కూటమిగా ఏర్పడాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకవేళ అది జరిగితే అమెరికాకు సవాళ్లు తప్పకపోవచ్చు. భారత్, రష్యా, చైనా బ్రిక్స్ కూటమిలో బలమైన భాగస్వామ్యం ఏర్పరిస్తే, అమెరికా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డాలర్ ఆధిపత్యం తగ్గడం ఖాయం. ఈ దేశాలు రూపాయి, యువాన్, రూబుల్ వంటి కరెన్సీలను గ్లోబల్ ట్రేడ్‌లో ప్రోత్సహిస్తే, డాలర్ విలువ తగ్గవచ్చు. అంతేకాక గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ను నియంత్రించే అవకాశం కలుగుతుంది. రష్యా చమురు, గ్యాస్ సరఫరాలు బ్రిక్స్ కూటమి ద్వారా కంట్రోల్ చేయగలిగితే గ్లోబల్ ఎనర్జీ ధరలపై అమెరికా ప్రభావం కోల్పోవచ్చు. అన్నిటికీ మించి ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై ఈ దేశాలు ఉమ్మడిగా వ్యవహరిస్తే, అమెరికా రాజకీయ ఆధిపత్యానికి గండి పడుతుంది. అందుకే ఈ కూటమి ఏర్పడకుండా భారత్‌పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. అయితే, భారత్ తన వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ, రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
ట్రంప్ విధించిన 50% సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతి రంగాలకు తీవ్ర సవాల్ గా మారిన మాట వాస్తవం. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని నిపుణులు చెప్తున్నారు. అందుకే భారత్ ఆచితూచి స్పందిస్తూ, రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఎగుమతి మార్కెట్లను పెంచుకోవడం, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించడం, బ్రిక్స్ కూటమితో సహకారం, అమెరికాతో దౌత్యపర చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది.
