సంక్రాంతి పండుగ అంటే వివిధ రకాల జానర్‌లలో సినిమాలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ 2026 సంక్రాంతి మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతోంది. పండక్కి రాబోయే సినిమాలు అన్నీ కూడా ఒకే జానర్‌కు సిండికేట్ అయిపోయాయా అన్నంతగా కనిపిస్తున్నాయి. ఎవర్ని పలకరించినా “నవ్విస్తాం” అనే మాట వినిపిస్తోంది. కథలు వేరైనా, అన్ని సినిమాల కాన్సెప్ట్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంటే. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు స్ట్రైట్ సినిమాలు విడుదల కాబోతుంటే, అన్నీ కామెడీ జానర్‌కు సంబంధించినవే కావడం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read :Aadarsha Kutumbam: వెంకటేశ్ ఫ్యామిలీలోకి వైలెన్స్ తీసుకొచ్చిన త్రివిక్రమ్?
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ అనిల్ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్ మార్క్‌తో ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతోంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం కామెడీ రూట్ ఎంచుకోవడం విశేషం. ‘రాజాసాబ్’ చిత్రం హారర్ కామెడీ జానర్‌లో వస్తోంది. తనదైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌కు ప్రసిద్ధి చెందిన నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో హైలైట్‌గా నిలవనుంది. మాస్ మహారాజా రవితేజ నుంచి కూడా కామెడీ జానర్‌లోనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా వస్తుండటం, ప్రీ-ప్రమోషనల్ వీడియోస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు అధికంగా ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ‘సామజవరగమన’ ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా కూడా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విడుదల కాబోతోంది. ఈ ఐదు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.