సినిమా ఇండస్ట్రీ మొత్తం ‘పెద్ది’ గురించే ఎందుకు మాట్లాడుకుంటోంది? సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ చేస్తున్నారా? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ అవుతుందా, లాభాలు తీసుకొస్తుందా? ‘పెద్ది’ తెలుగు సినిమాకు సక్సెస్ తీసుకొస్తుందా లేదా? ఏ ఇద్దరు సినిమా వాళ్ళు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కామన్ ఆడియన్ కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు?
ఐదు నెలలుగా ఫ్లాప్ల పరంపర సాగుతూనే ఉంది. ఒక్క హిట్ లేకుండా ఐదు నెలలు గడిచిపోయాయి. జనవరి 15న వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత హిట్ చూడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేదు. ఇలాగే ఇంకా ఎన్నాళ్ళు? ఈ ఫ్లాపుల పరంపరకు ‘పెద్ది’ ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న ప్రశ్నకు జూన్ 4న సమాధానం దొరకనుంది.మేలో లెక్కకు మించిన చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏదో ఒక చిన్న సినిమా హిట్ అవుతుందిలే అనుకుంటే, ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్‌ను దోచుకోలేదు. ‘గోదారి గట్టు పైన’, ‘రమణి కళ్యాణం’ వంటి ఎన్నో చిన్న చిత్రాలకు పోటీ లేకపోయినా.. కనీసం వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. గత ఐదు నెలలుగా ఒకటి రెండు డబ్బింగ్ మూవీస్ తప్ప, స్ట్రైట్ మూవీ ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. ‘ధురేందర్ 2’ కు ఉన్న క్రేజ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ‘వీరభద్రుడు’కు డివైడ్ టాక్ వచ్చినా కాస్తో గొప్పో పర్వాలేదు అనిపించుకుంది. ఆ మధ్య వచ్చిన ‘యూత్’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, ఐపీఎల్ సందడిలో కనిపించకుండా స్కోర్ బోర్డు లోంచి పోయింది.
2026 సమ్మర్ అనే కాదు, 2023 నుంచి ఏ సమ్మర్‌ని తీసుకున్నా వాయిదాల పర్వమే నడిచింది. సమ్మర్‌కి స్టార్స్ దూరం కావడం యంగ్ హీరోస్‌కి కలిసి వచ్చినా, ఆ ఛాన్స్ యూజ్ చేసుకోలేదు. మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ లేకుండా థియేటర్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నా.. ఐపీఎల్‌ని చూసి భయపడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది ఉండేదే. ఈ లెక్కన ఐపీఎల్ జరిగే రెండు నెలలు ఇండియన్ సినిమాకి అన్‌సీజన్. ఇక నుంచి సినిమాలకు సమ్మర్ సీజన్ అనేది లేనట్టే లెక్క! ప్రతి సమ్మర్‌లో పెద్ద హీరోలు మొహం చాటేసినట్టే, ఈ ఏడాది కూడా కంటిన్యూ చేశారు. ఆరు నెలల క్రితమే రిలీజ్ డేట్స్ ప్రకటించినా.. తీరా సమ్మర్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కరు చేతులెత్తేశారు. రామ్ చరణ్ ‘పెద్ది’, చిరంజీవి ‘విశ్వంభర’, సమంత ‘మా ఇంటి బంగారం’, వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఇలా చాలా సినిమాలు సమ్మర్‌కు దూరం కావడంతో థియేటర్స్ వెలవెలబోయాయి.
పండక్కి వచ్చిన ఐదు సినిమాల్లో మూడింటికి మంచి లాభాలు వచ్చాయి. ‘మన శంకర వరప్రసాద్’ సినిమాను 122 కోట్లకు అమ్మితే ఏకంగా 177 కోట్ల షేర్ వచ్చింది. ‘నారీ నారీ నడుమ మురారి’ 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే, 19 కోట్లు రాబట్టింది. ‘అనగనగా ఒక రాజు’తో నవీన్ పొలిశెట్టి వరుసగా నాలుగో హిట్‌ను వెనకేసుకున్నాడు. ఈ సినిమాను 27 కోట్లకు అమ్మితే 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కానీ, ఈ ఐదు నెలల్లో కేవలం మూడే హిట్స్ అంటే రెగ్యులర్ గా ఉండే 10% సక్సెస్ రేట్ కూడా లేదు. ఈ ఏడాది చెప్పుకోవడానికి సంక్రాంతి మూడు హిట్స్ తప్ప మరో మూవీ లేదు.
జనవరి 15న రిలీజ్ అయిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ చూడలేదు. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఐపీఎల్ దెబ్బ కొట్టిందన్నారు; సినిమాలు వాయిదా పడడానికి ఇండియన్ ప్రీమియర్ లీగే కారణంగా చూపారు. ఇక ఐపీఎల్‌కు శుభం కార్డు పడి, జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్ అవుతోంది. ‘ఉస్తాద్’ తర్వాత వస్తున్న పెద్ద స్టార్ సినిమా ఇదే. ‘పెద్ది’ సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం కూడా. ‘పెద్ది’ హిట్ కోసం కేవలం చిత్ర యూనిట్ మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. ‘ఉప్పెన’ హిట్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమా హిట్ అయితే బుచ్చిబాబు పై రామ్ చరణ్ పెట్టుకున్న నమ్మకం నిలబడుతుంది. రామ్ చరణ్ లాస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో.. మెగ్యా ఫ్యాన్స్ ‘పెద్ది’పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అలానే తెలుగు సినిమా 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి చాలా కాలమైంది; ‘పుష్ప 2’ తర్వాత మళ్లీ ఏ సినిమా కూడా ఈ ఫీట్ అందుకోలేదు. ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే ఈ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మారుతాయి.
