భారత ఆఫీసుల్లో ఇప్పుడు ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతోంది. నినాదాలు లేవు. సమ్మెలు లేవు. కానీ నిర్ణయాలు మాత్రం గట్టిగా తీసుకుంటున్నారు. ఒకే కంపెనీలో పదేళ్లు పనిచేయాలన్న ఆలోచనను జెన్-జీ తరం మెల్లగా వదిలేస్తోంది.
జీతం ఎంత పెరిగినా, జీవితం లేకపోతే ఆ ఉద్యోగం అవసరం లేదని స్పష్టంగా చెబుతోంది. ఈ మార్పు ఊహ కాదు.. ఇది డేటా. వేలాది మంది జెన్-జీ ఉద్యోగుల మాట. దేశవ్యాప్తంగా 23 వేల మందితో చేసిన సర్వేలు చెబుతున్న నిజమిది. ప్రతి ముగ్గురిలో ఒకరు రెండేళ్ల నుంచి మూడేళ్లకే ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటున్నారు. కారణం డబ్బు కాదు. పని ఒత్తిడి. ఆఫీస్ యాజమాన్యాలు టైమ్ సెన్స్ పాటించకపోవడం. అక్కడే తిష్ట వేసుకొని ఉండిపోతే ఎదుగుదల కనిపించకపోవడం. ఈ తరం ఉద్యోగాలను గౌరవిస్తోంది కానీ ఉద్యోగం పేరుతో జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా లేదు. పారదర్శకత కావాలి. నేర్చుకునే అవకాశం కావాలి. మెంటల్ పీస్ కావాలి. ఈ అంచనాలు కార్పొరేట్ ఇండియాను కొత్త ప్రశ్నల ముందుకు నెడుతున్నాయి.
ఒకవేళ ఈ వర్క్ కల్చర్ మారకపోతే టాలెంట్‌ను కార్పొరేట్ సంస్థలు నిలుపుకోగలవా? లేదా జెన్-జీ కోరుతున్న సమతుల్యతే రేపటి ఆఫీసుల నియమంగా మారబోతోందా?
ఈ మార్పు ఒక్క భారత్‌కే పరిమితం కాదు. కానీ భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ కార్పొరేట్ వ్యవస్థ ఒకే మోడల్ మీద నడిచింది. ఎక్కువ గంటలు పని చేయడమంటే నిబద్ధత. వీకెండ్‌ల్లో మెయిల్స్‌కు స్పందించడం అంటే కమిట్మెంట్. ఆఫీస్ తర్వాత కూడా ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉంచుకోవడం అంటే ప్రొఫెషనలిజం. ఈ నిర్వచనాలన్నింటినీ జెన్-జీ ప్రశ్నిస్తోంది. ఈ మార్పు మాటల్లో కాదు, గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25లో దేశవ్యాప్తంగా 23వేల మంది యువ ఉద్యోగులతో చేసిన పలు సర్వేలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. జెన్-జీ ఉద్యోగుల్లో 34 శాతం మంది రెండేళ్ల లోపే కంపెనీ మారాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరో 41 శాతం మంది మూడు నుంచి నాలుగు సంవత్సరాలకే కొత్త అవకాశాల కోసం చూస్తామని చెప్పారు. అంటే ప్రతి పది మందిలో ఏడుగురు లాంగ్ టర్మ్ ఉద్యోగ బంధాన్ని ఇక జీవిత లక్ష్యంగా చూడడం లేదు.
సర్వేలు మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెబుతున్నాయ్. జెన్-జీ ఉద్యోగుల్లో దాదాపు 60 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ మోడల్ లేకపోతే ఉద్యోగంలో చేరే ఛాన్స్ లేదని స్పష్టంగా చెబుతున్నారు. ఆఫీస్‌కు వెళ్లడంపై వ్యతిరేకత లేదు కానీ.. ఆఫీసే జీవితం మొత్తాన్ని తినేయకూడదనే అభిప్రాయం వీరిది. రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేసి, ట్రాఫిక్‌లో ఇంకో రెండు గంటలు గడిపే వ్యవస్థ తమకు అవసరం లేదని ఈ తరం భావిస్తోంది.
ఇది కేవలం ప్రైవేట్ ఐటీ రంగానికే పరిమితం కాదు. ఫైనాన్స్, కన్సల్టింగ్, ఈ కామర్స్ రంగాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. లింక్‌డిన్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం 2025లో జెన్-జీ ఉద్యోగుల జాబ్ హాపింగ్ రేటు మిల్లేనియల్స్‌తో పోలిస్తే 22 శాతం ఎక్కువ. ఒకే సంస్థలో ఐదేళ్లు పనిచేసే జెన్-జీ ఉద్యోగుల సంఖ్య 18 శాతం మాత్రమే. హాపింగ్ రేటు అంటే తరుచుగా ఉద్యోగాలు మారే రేటు అని అర్థం. ఈ మార్పుకు ప్రధాన కారణం జీతం కాదు. భారీ శాలరీ ప్యాకేజ్ కంటే వ్యక్తిగత జీవితానికి సమయం ఉండటమే తమకు ముఖ్యమని 67 శాతం మంది జెన్-జీ ఉద్యోగులు స్పష్టంగా చెప్పారు. 58 శాతం మంది ఓవర్‌టైమ్‌ను నిబద్ధతగా కాకుండా దుర్వినియోగంగా చూస్తున్నారు. 52 శాతం మంది వీకెండ్‌ల్లో మెయిల్స్ లేదా కాల్స్ రావడాన్ని అసహ్యంగా భావిస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో మెంటల్ హెల్త్ అంశం ఇక్కడ కీలకంగా మారింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే డేటా ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 45 శాతం మంది వర్క్ స్ట్రెస్ వల్ల ఆందోళన, నిద్రలేమి, ఎమోషనల్ ఎగ్జాషన్ అనుభవించామని చెప్పారు.
జెన్-జీ ఉద్యోగుల్లో ప్రతి నలుగురిలో ఒకరు బర్నౌట్ కారణంగా ఉద్యోగం వదిలేసిన అనుభవముందని అంగీకరించారు. ఇది గత తరాలతో పోలిస్తే రెట్టింపు సంఖ్య. ఈ పరిణామాల మధ్య జెన్-జీ ప్రత్యామ్నాయ మార్గాల్ని వేగంగా ఎంచుకుంటోంది. ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్, కాంట్రాక్ట్ రోల్స్ వైపు ఈ తరం ఎక్కువగా వెళ్లుతోంది. 2025 నాటికి భారత్‌లో గిగ్ వర్క్ చేస్తున్న యువతలో జెన్-జీ వాటా 38 శాతానికి చేరింది. ఇది ఐదేళ్ల క్రితం కేవలం 16 శాతం మాత్రమే. స్థిరత్వం కన్నా స్వేచ్ఛ.. హోదా కన్నా నైపుణ్యం అన్న ఆలోచనలే వీరికి ప్రాధాన్యంగా తెలుస్తోంది. ఇదంతా కార్పొరేట్ ఇండియాకు ఒక హెచ్చరికలా మారుతోంది. పాత మేనేజ్‌మెంట్ విధానాలు కొనసాగితే టాలెంట్ నిలుపుకోవడం అసాధ్యం అవుతుంది.
ఇప్పటికే కొన్ని సంస్థలు పని గంటల పరిమితి, నో మీటింగ్ డేస్, మెంటల్ హెల్త్ లీవ్స్, స్పష్టమైన ప్రమోషన్ మ్యాప్‌లాంటి మార్పులు మొదలుపెట్టాయి. నిజానికి ఇది జెన్-జీ చేస్తున్న తిరుగుబాటు కాదు. ఇది వారి లైఫ్‌పై వారికి ఉన్న క్లారిటీ. జీవితాన్ని తినేసే ఉద్యోగానికే అర్థం లేదన్న నిర్ణయం వారిది. ఈ లెక్కను అర్థం చేసుకున్న సంస్థలు భవిష్యత్తులో నిలబడతాయి. అర్థం చేసుకోని సంస్థలు మాత్రం టాలెంట్ వెళ్లిపోయిన తర్వాత కారణాలు వెతుక్కుంటూ మిగిలిపోతాయి.
ALSO READ: యుద్ధాలు, డబ్బులు, క్లైమేట్ ఛేంజ్.. బడ్జెట్ నుంచి Gen-Z ఏం ఆశిస్తోంది?