Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?

Musk

Musk

అంతరిక్షంలో ఉపగ్రహాల సామ్రాజ్యాన్ని శాసించే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు భారత గడ్డపై ఓ సరికొత్త వివాదానికి తెరలేపారు! దేశంలోకి ‘స్టార్‌లింక్’ ప్రవేశాన్ని ముకేశ్ అంబానీ అడ్డుకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. “అంబానీయే భారత్‌కు అసలైన బాసా?” అంటూ మస్క్ సంధించిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నో దేశాల్లో తిరుగులేని విజయాలు సాధించిన స్టార్‌లింక్‌కు భారత్‌లో ఎదురవుతున్న సవాళ్లేంటి? ఈ డిజిటల్ సామ్రాజ్యాల పోరు వెనుక అసలు కథేంటి? …. లెట్స్ వాచ్.

శాటిలైట్ల ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని భారత్ లో కూడా అందించేందుకు మస్క్ దాదాపు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 165 దేశాల్లో స్టార్ లింక్ అనుమతులు పొందింది. కోట్లాది మందికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. కానీ భారత్ లో మాత్రం స్పేస్ ఎక్స్ కు అనుమతులు రాకపోవడం మస్క్ ఆగ్రహానికి కారణమవుతోంది. అందుకే ఎక్స్ వేదికగా ఆయన ఆరోపణలు సంధిస్తున్నారు. దేశంలో కొందరి గుత్తాధిపత్యం కారణంగానే తమ స్టార్ లింక్ కు లైసెన్స్ రాకుండా అడ్డుపుతున్నారని మండిపడ్డారు. అసలు అంబానీయే భారత్ కు నిజమైనా బాసా అని ఎద్దేవా చేశారు. మరో అడుగు ముందుకేసి, డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. అంటూ సెటైర్లు వేశారు. మస్క్ నేరుగా అంబానీ పేరును ప్రస్తావించడం వివాదానికి పరాకాష్టగా నిలిచింది.

మస్క్ ఆరోపణల వెనుక భారత్ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థల ప్రభావం ఉందనే చర్చ జరుగుతోంది. దేశంలోకి స్టార్ లింక్ అడుగుపెడితే, తమ వ్యాపార సామ్రాజ్యానికి గండిపడుతుందనే భయంతోనే కొందరు ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారని మస్క్ పరోక్షంగా విమర్శించారు. ముఖ్యంగా రిలయన్స్ జియో సొంతంగా శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. అదే జరిగితే, మార్కెట్‌లో పోటీతత్వం పెరుగుతుంది. అందుకే.. ఈ దిగ్గజాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయికి చేరింది.

అయితే, మస్క్ ఆరోపణలను భారత సమాచార మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్స్ విధానాలు అత్యంత పారదర్శకంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నాయని స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌తో పాటు యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి మూడు ప్రధాన ఆపరేటర్ల లైసెన్సులు ఒకే దశలో ఉన్నాయని వివరించింది. సెక్యూరిటీ క్లియరెన్స్, స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం ఈ మూడూ ఎదురుచూస్తున్నాయని ప్రభుత్వం తేల్చిచెప్పింది. నిబంధనలను పాటించకుండా ఆరోపణలు చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా హితవు పలికాయి.

ఓ వైపు ఈ వివాదం ముదురుతోంది. మరోవైపు.. ఇవే సంస్థలు కేవలం పోటీదారులుగానే కాకుండా, వ్యూహాత్మక వ్యాపార భాగస్వాములుగా పనిచేయాలని చూస్తున్నాయి. 2025 మార్చిలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు స్పేస్‌ఎక్స్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రభుత్వ అనుమతులు లభిస్తే, భారత్‌లో స్టార్‌లింక్ పరికరాలను, సేవలను పంపిణీ చేయడంతో పాటు నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా పంచుకునే దిశగా చర్చలు జరిపాయి. అయితే మస్క్ తాజా ఆరోపణలు ఈ వ్యాపార బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలీదు. కానీ ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ వివాదంపై స్పందించారు. తాము వివాదాల జోలికి పోకుండా కేవలం వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.

భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశానికి టెక్నికల్ సమస్యలతో పాటు, సెక్యూరిటీ పరమైన సవాళ్లు కూడా బలంగానే ఉన్నాయి. 2024లో అండమాన్ నికోబార్ దీవులలోని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులోనూ, మణిపూర్‌లో జరిగిన ఆర్మీ ఆపరేషన్‌లోనూ కొన్ని స్టార్‌లింక్ పరికరాలు లభించడం భద్రతా సంస్థలను కలవరపెట్టింది. అయితే ఆ సమయంలో స్టార్ లింక్ సేవలు భారత్‌లో యాక్టివ్‌గా లేవని మస్క్ వెల్లడించారు. కానీ దేశ భద్రత, నిఘా కోణంలో ప్రభుత్వం ఎలాంటి లోపాలకు తావులేకుండా పక్కాగా వ్యవహరిస్తోంది. నేరుగా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ సేవలు నేరుగా పొందే అవకాశం ఉండడంతో.. నియంత్రణ కష్టసాధ్యమనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. పైగా స్టార్ లింక్ సేవలన్నీ అమెరికా కేంద్రంగా నడుస్తుంటాయి. అలాంటప్పుడు స్టార్ లింక్ ను నియంత్రంచడం మనకు కష్టసాధ్యమనే ఆందోళన భద్రతావర్గాల్లో ఉంది. ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు స్టార్ లింక్ సేవలను మిస్ యూజ్ చేస్తారనే భయం కూడా వ్యక్తమవుతోంది.

దీనికి తోడు.. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని సాధారణ ప్రజలకు స్టార్‌లింక్ టారిఫ్‌లు అందుబాటులో ఉంటాయా లేదా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది. అమెరికాలో నెలకు సుమారు 55 డాలర్లు అంటే.. సుమారు 5వేల రూపాయల నుంచి స్టార్ లింక్ ప్లాన్లు ప్రారంభమవుతాయి. సగటు భారతీయ మధ్యతరగతి లేదా గ్రామీణ కుటుంబాలకు ఈ ధరలు భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డివైజ్ కోసమే సుమారు 30వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం.

డిజిటల్ ఇండియా సాధనలో భాగంగా అందరికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే గ్లోబల్ టెలికాం మార్కెట్‌ను శాసించాలనే మస్క్ ఆశలకు, దేశీయ దిగ్గజ వ్యాపార హక్కులకు మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్‌ ఎటు దారితీస్తుందనేది ఉత్కంఠగా మారింది.!