అతను కేవలం ఒక మనిషి కాదు.. అతను కలల సృష్టికర్త. అసాధ్యాలను సవాలు చేసే ధైర్యవంతుడు. మానవాళి భవిష్యత్తును తిరిగి రాసే సాహసి. అతనే ఎలాన్ మస్క్. ఈ పేరు వినగానే నక్షత్రాలతో నిండిన ఆకాశం కళ్ల ముందు కనిపిస్తుంది. రాకెట్‌ల గర్జనలు చెవుల్లో మార్మోగుతాయి. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి పయనించే మానవుల చిత్రం మదిలో మెదులుతుంది. అంతరిక్ష పరిశోధనలో శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, దేశాలు సాధించలేని ఘనతలను ఎలాన్ మస్క్ తన స్పేస్‌ఎక్స్ సంస్థ ద్వారా సాధిస్తున్నాడు. ఈ అసాధారణ విజయాల వెనుక ఉన్న శక్తి ఏంటి? ఎలాన్ మస్క్ కు మాత్రమే ఇవి ఎలా సాధ్యమవుతున్నాయి? అతని అద్భుత ప్రయాణాన్ని, అతని విజయ రహస్యాలను ఈ స్టోరీలో చూద్దాం…
సునీతా విలియమ్స్ టీమ్ ను 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమికి చేర్చిన ఘనత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు చెందుతుంది. నాసా లాంటి దిగ్గజ అంతరిక్ష సంస్థలకు సాధ్యం కానిది ఎలాన్ మస్క్ కు సాధ్యమైంది. ఎలాన్ మస్క్ శాస్త్రవేత్త కాదు. వ్యాపారవేత్త కాదు. ఆవిష్కర్త కాదు.. అతను ఈ మూడింటి అరుదైన సమ్మేళనం. 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్, చిన్న వయస్సు నుంచే సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. 12 ఏళ్ల వయస్సులోనే ఒక వీడియో గేమ్‌ను సృష్టించి, దాన్ని విక్రయించి డబ్బు సంపాదించాడు. ఈ సృజనాత్మకత, ధైర్యం అతని విజయాలకు పునాది వేసాయి. స్పేస్‌ఎక్స్ ను 2002లో స్థాపించినప్పుడు, అంతరిక్ష పరిశోధనలో ప్రభుత్వ సంస్థల ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయంలో అతనికి పూర్తి క్లారిటీ ఉంది. అంతేకాక అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైనదిగా, సాధారణమైనదిగా మార్చాలనేది మస్క్ ఆలోచన. నాసా, రోస్‌కాస్మాస్, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు సాంప్రదాయిక పద్ధతులతో పనిచేస్తాయి. ఒక రాకెట్‌ను ప్రయోగించడానికి వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాయి. ఒక్కసారి రాకెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని వదిలేస్తాయి. కానీ మస్క్ ఈ ఆలోచనను తలకిందులు చేశాడు. అతను రాకెట్‌లను మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగేలా రూపొందించాడు. ఈ ఆలోచనే స్పేస్‌ఎక్స్ ను ఇతర సంస్థల నుంచి వేరు చేసింది.
Also Read : Putin: ట్రంప్ కోసం చర్చిలో పుతిన్ ప్రార్థనలు.. కారణం ఏంటంటే..
స్పేస్ ఎక్స్ ను స్థాపించిన తర్వాత ఎలాన్ మస్క్ అనేక అద్భుతాలను సృష్టించాడు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఎలాన్ మస్క్ అడుగులు అందరినీ నివ్వెరపరిచాయి. స్పేస్ ఎక్స్ సాంకేతిక ఆవిష్కరణలు నాసా లాంటి అంతరిక్ష పరిశోధన సంస్థలను సైతం ఆశ్చర్యపరిచాయి. స్పేస్‌ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక మైలురాయి. 2015లో మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ బూస్టర్‌ను భూమిపైకి తిరిగి ల్యాండ్ చేయడంలో స్పేస్‌ఎక్స్ విజయం సాధించింది. ఈ సాంకేతికత అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించింది. ఒక ఫాల్కన్ 9 ప్రయోగం సాధారణంగా 60 మిలియన్ డాలర్ల ఖర్చుతో పూర్తవుతుంది. ఇది నాసా లేదా ఇతర సంస్థల రాకెట్ ప్రయోగాల కంటే చాలా తక్కువ. ఈ రీయూజబుల్ టెక్నాలజీ వల్ల స్పేస్‌ఎక్స్ తరచూ ప్రయోగాలు చేయగలుగుతోంది.. అది కూడా తక్కువ బడ్జెట్‌లో.! స్పేస్ ఎక్స్ కు చెందిన మరో ముఖ్యమైన ఆవిష్కరణ స్టార్‌షిప్. ఇది పూర్తిగా రీయూజబుల్ రాకెట్ సిస్టమ్. దీని ద్వారా మానవులను మార్స్ కు పంపాలనేది మస్క్ లక్ష్యం. 2024లో స్టార్‌షిప్ బూస్టర్‌ను కూడా లాంచ్ ప్యాడ్‌పై తిరిగి ల్యాండ్ చేయడంలో స్పేస్‌ఎక్స్ విజయం సాధించింది. ఇలా జరగడం చరిత్రలో మొదటిసారి.
మస్క్ పట్టిందల్లా బంగారం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మస్క్ కూడా ఎన్నో అపజయాలను చవిచూశారు. అయితే వాటి నుంచి నేర్చుకుని సక్సెస్ అయ్యారు. వైఫల్యాలను సవాళ్లుగా తీసుకోవడం మస్క్ కు అలవాటు. ఈ లక్షణమే మస్క్ ను మిగిలిన వారితో వేరు చేస్తుంది. మస్క్ విజయాల వెనుక ఉన్న మరో కీలక అంశం — వైఫల్యాలను సానుకూలంగా స్వీకరించడం. స్పేస్‌ఎక్స్ మొదటి రోజుల్లో అనేక ప్రయోగాలు విఫలమయ్యాయి. 2006, 2007, 2008లలో ఫాల్కన్ 1 రాకెట్లు పేలిపోయాయి. కానీ మస్క్ ఈ వైఫల్యాలను ఒక అవకాశంగా భావించాడు. ప్రతి పేలుడు తర్వాత అతని టీం సమస్యలను విశ్లేషించి, సాంకేతికతను మెరుగుపరిచింది. 2008లో తొలిసారి ఫాల్కన్ 1 విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. అది స్పేస్‌ఎక్స్ కు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రయోగాలు చేయడం, విఫలమైతే వాటి నుంచి నేర్చుకుని సరిచేయడం మస్క్ కు అలవాటు. ఇది సాంప్రదాయ సంస్థలైన నాసా, ఇస్రో లాంటి వాటికి వ్యతిరేకం. సహజంగా ఇలాంటి సంస్థలు సుదీర్ఘ ప్రణాళికలతో, తక్కువ రిస్క్ తో పనిచేస్తాయి. కానీ మస్క్ మాత్రం రిస్క్ చేసేందుకే ముందుంటారు.
Also Read : Elon Musk: జో బిడెన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకురానివ్వలేదు?.. కారణం చెప్పిన మస్క్..
ఇంతకుముందే చెప్పుకున్నట్టు కేవలం మస్క్ మాత్రమే ఇవన్నీ సాధ్యం చేయలేరు. ఇందుకోసం ఆయన తన టీం పైన ఆధారపడతారు. అత్యంత సమర్థులైన సైంటిస్టులను, టెక్నాలజీ నిపుణులను తన వద్ద ఉంచుకోవడం మస్క్ అలవాటు. వాళ్లను నడిపించేందుకు మస్క్ ఇష్టపడతారు. మస్క్ వెనుక అద్భుతమైన ఇంజనీర్ల బృందం ఉంది. స్పేస్‌ఎక్స్ లో పనిచేసే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అత్యంత ప్రతిభావంతులు. అంకితభావంతో ఉంటారు. మస్క్ వారికి స్వేచ్ఛను ఇస్తారు. సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తారు. అతని నాయకత్వ శైలి మాత్రం కఠినంగా ఉంటుంది. టార్గెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని సాధించేవరకూ టీంను నిద్రపోనివ్వరు. ఇది టీంకు కాస్త ఇబ్బందిగా అనిపించినా మస్క్ వాళ్లను ఎప్పటికప్పుడు ఉత్తేజరపరుస్తుంటారు. దీంతో మస్క్ దగ్గర పనిచేసే టీం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది. స్టార్‌షిప్ ప్రాజెక్ట్ లో రోజూ 18 గంటలు పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు.
ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానివాటిని మస్క్ సాధ్యం చేస్తున్నారంటే దాని వెనుక ఆలోచన, పట్టుదల ఉంటే సరిపోదు. డబ్బు కావాలి. ఈ విషయంలో మస్క్ చాలా విభిన్నంగా ఆలోచిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఖర్చు పెట్టేందుకు మస్క్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మస్క్ తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని స్పేస్‌ఎక్స్ లో పెట్టుబడి పెట్టాడు. 2008లో సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, అతను తన టెస్లా షేర్లను అమ్మేసి స్పేస్‌ఎక్స్ ను రక్షించాడు. ఆ తర్వాత నాసా నుంచి 1.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ లభించడంతో స్పేస్‌ఎక్స్ ఊపిరి పీల్చుకుంది. ఆర్థిక స్థిరత్వం లభించింది. ఇప్పుడు స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తూ.. స్పేస్‌ఎక్స్ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ డబ్బును మళ్లీ పరిశోధనల్లో పెట్టడం వల్ల స్పేస్‌ఎక్స్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది.
ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ చాలా పెద్దవిగా ఉంటాయి. చిన్నవాటితో సంతృప్తి చెందే రకం కాదు మస్క్. అందుకే ఆయన భవిష్యత్ లక్ష్యాలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇవి కేవలం రాకెట్ ప్రయోగాలకే పరిమితం కావట్లేదు. మానవాళిని బహుగ్రహ నాగరికతగా అంటే.. మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్ గా మార్చాలని ఎలాన్ మస్క్ కలలు కంటున్నాడు. అంటే భూమిపైన మాత్రమే కాకుండా అంగారకుడు, చంద్రుడు లాంటి గ్రహాలపైన కూడా నివాసాలు ఏర్పరుచుకోవడం, అక్కడ మనుషులు జీవించగలగడం, అక్కడికి నిత్యం రాకపోకలు సాగించడం లాంటివన్నమాట. 2026 నాటికి స్టార్‌షిప్ ద్వారా అంగారకుడిపైకి మానవులను పంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించినట్లవుతుంది. అంతేకాదు.. స్టార్‌లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు సిద్ధమయ్యాడు.
ఇవన్నీ చూస్తుంటే ఎలాన్ మస్క్ మనిషేనా.. లేకుంటే రోబోనా అనిపించవచ్చు. ఎవరికీ సాధ్యం కానివాటిని ఎలాన్ మస్క్ ఎలా సాధిస్తున్నారనే సందేహం కలుగవచ్చు. ఇతరులకు, ఇతర సంస్థలకు సాధ్యం కానిది మస్క్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతోంది అనేందుకు కొన్ని కారణాలున్నాయి. మొదటిది- అతని అసాధారణ ఆలోచనలు! సమస్యలను ఎలాన్ మస్క్ విభిన్న కోణంలో చూస్తారు. రెండోది- సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి! రీయూజబుల్ రాకెట్‌లు, స్టార్‌షిప్ వంటివి దీనికి ఉదాహరణలు. మూడోది- వైఫల్యాల నుంచి నేర్చుకునే స్థైర్యం. ఎన్నిసార్లు విఫలమైనా నిరాశ చెందకుండా ముందుకు సాగడం మస్క్ నైజం. ఇక నాల్గోది- బలమైన బృందం. మస్క్ తన చుట్టూ ఎప్పుడూ అత్యంత సమర్థులను పెట్టుకుంటారు. అలాంటి వాళ్లను నడిపించేందుకు మస్క్ ఇష్టపడతారు. చివరది- తెలివైన ఆర్థిక వ్యూహం. డబ్బు సంపాదించడం మస్క్ కు ఓ వ్యసనం. దాన్ని విభిన్నరంగాల్లో ఖర్చు పెట్టడం ఆయనకు ఇష్టం. ఇలాంటి అంశాలన్నీ మస్క్ ను అంతరిక్ష రంగంలో ఒక అసాధారణ వ్యక్తిగా నిలబెట్టాయి.
ఎలాన్ మస్క్ అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తున్న విజయాలు కేవలం టెక్నాలజీ వండర్స్ మాత్రమే కాదు. అవి మానవాళి భవిష్యత్తును మార్చే ఫలితాలు. అతని ప్రయత్నాలు విజయవంతమైతే, అంతరిక్ష ప్రయాణం ఒక సామాన్య విషయంగా మారిపోవచ్చు. మానవులు ఇతర గ్రహాలపై జీవించవచ్చు. ఎవరికీ సాధ్యం కానివి మస్క్ మాత్రమే ఎలా సాధ్యమవుతున్నాయంటే.. అతను అసాధ్యం అనుకున్నవాటి గురించి మాత్రమే కలలు కంటారు. వాటిని నిజం చేసేందుకు ధైర్యంగా ముందుకెళ్తారు. దటీజ్ ఎలాన్ మస్క్..!