మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ రస్టిక్ హై-ఎనర్జీ డ్రామా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమెను స్క్రీన్‌పై చూపించిన విధానంపై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ప్రెజెంటేషన్ చుట్టూ జరుగుతున్న చర్చపై బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. కొంతమంది ప్రేక్షకుల నుండి ఈ స్థాయిలో ప్రతికూల స్పందన వస్తుందని తాను అస్సలు ఊహించలేదని ఆయన అంగీకరించారు. సినిమాలో జాన్వీ పాత్ర కేవలం ఒక కమర్షియల్, గ్లామరస్ హంగులకే పరిమితమైందని, కొన్ని సీన్స్‌లో ఆమెను మితిమీరిన గ్లామరస్‌గా చూపించారంటూ ఒక వర్గం ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బుచ్చిబాబు మాట్లాడుతూ… “రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక ఆహ్లాదకరమైన, ఆటపట్టించే రొమాంటిక్ ట్రాక్‌ను చూపించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ‘పెద్ది’ ఒక పల్లెటూరి నేపథ్యంతో సాగే హై-వోల్టేజ్ డ్రామా. ఆ కథాంశానికి, సినిమా మూడ్‌కు తగినట్లుగానే జాన్వీ పాత్రను డిజైన్ చేశాం. ఎవరినీ తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదు, వివాదాలు సృష్టించడం మా లక్ష్యం కాదు” అని స్పష్టం చేశారు. ఇది నా రెండో సినిమా రాబోయే సినిమాలలో ఈ విషయం మీద కేర్ తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు.

