అల్లు అర్జున్ హీరోగా, అనూ మెహతా హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్య. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు అయ్యాయి. అల్లు అర్జున్ లైఫ్ ఛేంజింగ్ మూవీగా నిలిచిన ఆర్య విశేషాలు ఇవీ:
అలా మొదలై
2004 మే 7, మే ఎండల గురించి చెప్పేదేముంది? అప్పటికే స్కూళ్లూ, కాలేజీలకు సెలవులు. అయినా ఎండల దెబ్బకు బయటకు వచ్చేవారు తక్కువే. ఆ రోజు విడుదలైన సినిమాల్లో ఆర్య కూడా ఒకటి. మార్నింగ్ షో పడింది, ఇదేదో ఫీల్ మై లవ్ అంటున్నారు, ఏంట్రా కొత్తగా? హీరో క్యారెక్టర్ ఇలా ఉంది ఏంటి? అంటూ డివైడ్ టాక్. వన్‌సైడ్ లవ్ కాన్సెప్ట్ కొత్త కావడంతో ప్రేక్షకులు వన్‌సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు. అయితే, ఇదంతా మొదటి రెండు రోజుల సంగతే. ఆ తర్వాత కట్ చేస్తే 125 రోజులు ప్రదర్శితమై, టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసింది.
సుకుమార్ ఎంట్రీ
కాకినాడ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేసే సుకుమార్‌కి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వెళ్లి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం అందుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న దిల్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశారు. ఆ పని చేస్తూనే తన మార్క్‌తో ఒక కథ రాసుకున్నారు. అది దిల్ రాజుకి చెబితే, దిల్ సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని మాటిచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాజుని దిల్ రాజుని మార్చేసింది. ఆ విజయోత్సాహంలో ఉన్న ఆయన సుకుమార్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు టైటిల్ నచికేత అనుకున్నారు. దిల్ స్పెషల్ షోకి అప్పటికే గంగోత్రి చేసి ఉన్న అల్లు అర్జున్ కూడా వెళ్లగా, అక్కడ చలాకీతనం, హాస్య చతురత చూసిన సుకుమార్, నా హీరోలా ఉన్నాడే, ఆ క్యారెక్టరే ఇతనిది అని అనుకున్నారు. మనసులో మాట దిల్ రాజుకి చెబితే, ఆయన వెంటనే వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడారు. గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన ఆయన, వీళ్లు చెప్పేదీ రొటీన్ స్టోరీనే అనుకుని ముందు వద్దన్నా, విన్నాక అదుర్స్ అన్నారు. అల్లు అరవింద్, చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చాక, నచికేత టైటిల్ నుంచి ఆర్యకి ఫిక్స్ చేశారు.
షూటింగ్ & సాంగ్స్
ఆ క్రమంలోనే 2003 నవంబర్ 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ఆర్యను 120 రోజుల్లో పూర్తి చేశారు సుకుమార్. ఇక సినిమా జనాల్లోకి వెళ్లాలంటే పాటలు ముఖ్యం. అప్పటికి ట్రెండ్‌లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌తో సుకుమార్ కలిసిపోయాడు. ఇద్దరికీ మంచి రాపో దొరికింది. ఫీల్ మై లవ్ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీలయ్యేలా చేయడమే కాదు, తకధిమితోం అంటూ చిందులు తొక్కించారు. అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పినా వారికే చెల్లింది. ఇక అలా రూ.4 కోట్లతో నిర్మించి రిలీజ్ చేస్తే, డివైడ్ టాక్‌తో మొదలై బ్లాక్‌బస్టర్ అయ్యి, ఫుల్ రన్‌లో రూ.30 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే, రూ.35 లక్షల వరకూ వసూలు చేసి అల్లు అర్జున్‌కు మల్లు అర్జున్ అనే పేరు కూడా సంపాదించి పెట్టింది.
పాత్ మేకింగ్ ఫిలిం
నిజానికి అల్లు అర్జున్ గంగోత్రి ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అయితే, తన తొలి సినిమాకు, రెండో సినిమాకు గుర్తు పట్టలేనంతగా అతడు మారిపోయాడు. అతనిలోని స్టైలిష్ స్టార్‌ను పరిచయం చేసిన సినిమా ఈ ఆర్య. గంగోత్రిలో అమాయకుడైన ఓ అబ్బాయి పాత్రలో కనిపించిన బన్నీ, ఆర్యలో మాత్రం డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతోపాటు తనలోని అసలైన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్‌ను బయటపెట్టాడు. యూత్‌లో స్టార్‌గా మారిపోవడానికి కారణం ఈ ఆర్య సినిమానే. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్, నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమా ఎందరో జీవితాలను మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్ రాజు, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, డీఓపీగా రత్నవేలు, డిస్ట్రిబ్యూటర్‌గా బన్నీ వాసు ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్‌లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది.