దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆయన తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. తమిళంలో కూడా హీరోగా అనేక సినిమాలు చేశాడు. అయితే అవేవీ తీసుకురాని గుర్తింపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమా తీసుకువచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో ఆది నటించాడు. ఆ సినిమాలో వైరం ధనుష్ అనే ఒక సీఎం కొడుకు పాత్రలో అదరగొట్టాడు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆది పినిశెట్టి అంటే ఎవరో అనే ఆలోచిస్తారేమో కానీ వైరం ధనుష్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు అయితే ఇప్పుడు దానికి మించిన పాత్రని బోయపాటి శ్రీను ఆది కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సీక్వెల్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి జాయిన్ అయినట్లు ఈమధ్య టీం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ఆయన బాలకృష్ణను ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో అది కూడా ఒక అఘోరా పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆ లుక్కు కూడా ఆయనకు బాగా సెట్ అయిందని నెవర్ బిఫోర్ అనేలా ఈ పాత్ర పండుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇకమీదట వైరం ధనుష్ అని కాకుండా అఖండ ఆది అని గుర్తుపెట్టుకునేలా ఈ పాత్ర పేలే అవకాశం ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.