Zojila Tunnel Breakthrough: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ వేదికగా నిలిచింది. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి నితిన్ గడ్కరీ తోపాటు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాలు కూడా హాజరయ్యారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్‌లో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) కీలక మైలురాయిని చేరుకుంది. భవిష్యత్ భారతానికి కొత్త మార్గాన్ని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ దేశ సంకల్పానికి, సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
శ్రీనగర్ నుంచి లడఖ్ వరకు ఉన్న జాతీయ రహదారి-1 (NH-1) మొత్తం పొడవు 421 కిలోమీటర్లు. ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లడఖ్ చేరాలంటే 13 వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాల్లో సుమారు 12 నుంచి 14 గంటలపాటు ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా బల్తాల్ నుంచి కార్గిల్ జిల్లాలోని మీన్‌మార్గ్ వరకు 40 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది. అయితే జోజిలా టన్నెల్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇదే ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయగలిగే పరిస్థితి ఏర్పడనుంది.
13.153 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్‌గా గుర్తింపు పొందుతోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం కొనసాగుతోంది. ఏడాది పొడవునా లడఖ్ ప్రాంతానికి రాకపోకలు కొనసాగేందుకు ఈ టన్నెల్ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నిర్మాణానికి MEIL న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM)ను ఉపయోగించింది. 2020 అక్టోబర్ 1న ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కాగా, అక్టోబర్ 14న తొలి బ్లాస్టింగ్ చేపట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
టన్నెల్ నిర్మాణంలో సుమారు 1,500 మంది ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. హిమాలయ ప్రాంతంలో ఏడాదిలో దాదాపు 100 రోజుల పాటు మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే గడ్డకట్టే చలిలో కూడా పనులు కొనసాగించడం విశేషం. తీవ్ర మంచు, కొండచరియల ప్రమాదాలు, క్లిష్ట భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొంటూ నిర్మాణ బృందం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణ పనులు చేపట్టిన MEIL, 10 మిలియన్ సేఫ్ మాన్ అవర్స్ నమోదు చేసి మరో రికార్డును సృష్టించింది. భారీ సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది.

