Zim vs SA: బులావయో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. “ఇది టెస్టు మ్యాచ్ కాదు.. టీ20 ఆడుతున్నామో” అనేలా భారీ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ, తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 465 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వియాన్ ముల్డర్ (264 నాటౌట్) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.
Read Also:Shubman Gill: ఆ ఒక్క మాటతో మరో మెట్టు ఎక్కేసిన కెప్టెన్ గిల్.. ఆటగాడి పేరు ప్రస్తావిస్తూ..?
టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్వైన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, వారి నిర్ణయమే వాళ్లకు శాపంలా మారింది. ఆరంభంలో రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా.. ముల్డర్, బెడింగ్హామ్, ప్రిటోరియస్ లతో దక్షిణాఫ్రికా రికార్డు స్థాయిలో పునరాగమనాన్ని చేసింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ 259 బంతుల్లో 264 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 34 ఫోర్లు, 3 సిక్సులు బాదడంతో, ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనపడ్డాయి. 101.93 స్ట్రైక్‌రేట్ తో అతను డబుల్ సెంచరీ చేశాడు. అంతకుముందు బెడింగ్హామ్ (82) ముల్డర్‌తో కలిసి 184 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు.
ఆ తర్వాత ప్రిటోరియస్ కూడా దూకుడిగా ఆడి 78 పరుగులు (87 బంతుల్లో) సాధించాడు. దానితో జట్టును 400 పరుగులకు తీసుకెళ్లాడు. ఇక ఆట మొదటి రోజు ముగింపు సమయానికి బ్రెవిస్ (15 నాటౌట్) ముల్డర్‌తో క్రీజులో ఉన్నాడు. మరోవైపు జింబాబ్వే బౌలర్లలో టానాకా చివాంగ, మటిగిము, మసకడ్జా తలో వికెట్ మాత్రమే తీశారు.
Read Also:ENG vs IND: బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ ఘన విజయం.. 58 ఏళ్ల తర్వాత..
పూర్తి రోజూ 88 ఓవర్లు సాగిన ఆటలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వీర బాదుడు బాదారు. తొలి ఇన్నింగ్స్‌లోనే మానసికంగా ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశారు. బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు ఈ నిర్ణయం తలనొప్పిగా మారింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 465/4తో నిలిచిన దక్షిణాఫ్రికా, రెండో రోజు మరింత స్కోరు కట్టడం ఖాయం. చూడాలి మరి నేడు ఇంకెంత విధ్వంసం జరగనుందో.