NTV Telugu Site icon

YSRCP MP Joins TDP: టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ

Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju

YSRCP MP Joins TDP: ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు ప్రజాగళ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలు ముందుకొచ్చానని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. జూన్‌ 4న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ ప్రభంజనం సృష్టించబోతున్నారని సభలో అన్నారు. అందరి ఆమోదంతో పాలకొల్లులో రఘురామకృష్ణంరాజును టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనను సాదరంగా పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు చెప్పారు. గతంలో రఘురామను కస్టడీలోకి తీసుకుని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురి చేశారన్నారు.

Read Also: Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

టీడీపీలో చేరేముందు రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఓడించే సత్తా తనకు ఉందని, ఆ స్థాయికి తాను ఎదిగానని అన్నారు. తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని… కూటమి నుంచి పోటీ చేయడమే తన ఆశయమని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై తనకు చాలా మంది సలహాలు ఇస్తున్నారని.. ఎక్కడి నుంచి బరిలోకి దిగినా తాను గెలుస్తానన్నారు. నియోజకవర్గం నుంచి తనను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. అన్యాయాన్ని ఎదిరించినందుకు తనపై ఎన్నో తప్పుడు కేసులు మోపి, వ్యక్తిగతంగా వేధించారన్నారు. అధికార పార్టీలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించానన్న ఆయన.. తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానన్నారు. ఇదిలా ఉండగా.. నర్సాపురం ఎంపీ స్థానం టీడీపీకి ఇచ్చేలా.. చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చి నర్సాపురం టీడీపీకి తీసుకుని రఘురామకు అవకాశం ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.