YSRCP: ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్‌లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. జమిలి ఎన్నికల ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉండదన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలో ఏక కాలంలోనే కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు లేకపోతే కోర్టు ఎందుకు రిమాండ్ విధిస్తుందని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ దేశం వదిలి ఎందుకు పారిపోయారన్నారు. ప్రభుత్వ డబ్బు షెల్ కంపెనీల ద్వారా ఎలా రూటింగ్ అయ్యిందో ఐటీ , ఈడీ ఆధారాలతో సహా బయట పెట్టాయన్నారు. ఐటీ, ఈడీలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు కదా అంటూ ఆయన తెలిపారు.
Also Read: AP CM Jagan: రెండు రోజుల పాటు సీఎం జగన్ బిజీ షెడ్యూల్ ఇదే..
చంద్రబాబు పీఎ శ్రీనివాస్ రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపిందని ఆయన తెలిపారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రియ శిష్యుడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి రాష్ట్రంలో ఓట్ బ్యాంకు లేదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్‌కే ప్రజల మద్దతు ఉందని.. మేం ప్రజలనే నమ్ముకున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.