Perni Nani: ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్న చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందన్నారు. చంద్రబాబు స్లీపర్ సెల్స్ చచ్చిపోతూ వస్తున్నాయని.. ఇవాళ అడ్డగోలుగా దొరికారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని కోర్టులు తిరిగినా పునీతుడిగా చంద్రబాబు బయటకు రాలేరన్నారు. చిన్న పిల్లలకు కూడా చంద్రబాబు డబ్బులు తిన్నట్లు అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన లూటీ అర్థం అయిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వస్తారని ప్రశ్నించారు. బయట పీపీటీలు వేయటం ఎందుకు…అసెంబ్లీ నుంచి పారిపోవటం ఎందుకు అంటూ టీడీపీ నేతలను పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజాధనాన్ని లూటీ చేసిన అన్ని కేసులపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
Also Read: Chandrababu Arrest: చంద్రబాబు లాయర్ మరో ఆసక్తికర ట్వీట్.. రాత్రి తర్వాత తెల్లవారుతుందంటూ..!
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. రేపు, ఎల్లుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ జరగనుంది. సీఐడీ కస్టడీ నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిబంధనలు జారీ చేసింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును ఏయే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనే అంశంపై సీఐడీ అధికారులు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.