Vijayasai Reddy: నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు. ఆ సెక్షన్స్ కూడా తన మీద లేవన్నారు. చంద్రబాబు ఏ1గా మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయని.. ఎన్నికల అనంతరం చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని విమర్శించారు. అవినీతి సొమ్ము అయినా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏపీ అయినా బాగుపడేదన్నారు. ఏ1 గా ఉన్న వ్యక్తి ఏ2 మీద ఆరోపణలు చేయటం అసంబద్ధమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు షాక్.. వారాహి సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా గెలిచి మా పార్టీపైనే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మమ్మల్ని తిడుతూ ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. బీజేపీతో కలవడం వల్లే చర్యల నుంచి తప్పించుకొన్నారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ అయినా రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకుని చట్ట సభలకు పంపాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతీ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుందని.. ఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ అంటూ ఆయన విమర్శించారు. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసిందన్నారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత మా సీఎం తీసుకున్నారని.. అందరికీ న్యాయం జరుగుతుందని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.