YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన వైసీపీ 80కి పైగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది.. ఇక, ఇప్పుడు ఏడో జాబితాపై కసర్తు మొదటు పెట్టింది.. దీంతో.. ఆ నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, టికెట్ ఆశిస్తున్నవారు.. ఇలా అంతా సీఎంవోకు క్యూ కడుతున్నారు.. ఈ రోజు సీఎంవోకు వచ్చారు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధు సూధన్.. ఇక, మంత్రులు వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహసన్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్, అనంత వెంకట్రామిరెడ్డి.. ఇలా పలువురు నేతలు సీఎంవోకు వచ్చి చర్చలు జరిపారు.
ఇక, రెండోసారి కూడా తాడేపల్లిలోని సీఎంవోకు వచ్చారు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్.. చీరాల అసెంబ్లీ టికెట్ కోసం సీఎంవోలో ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు.. బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కూడా వైసీపీ అధిష్టానం వద్దకు వచ్చారు.. కోడుమూరు అసెంబ్లీ ఇంఛార్జ్‌గా ఆదిమూలపు సతీష్ ను నియమించారు సీఎం జగన్.. దీంతో, కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్.. అందుకోసమే ఆయకు సీఎంవో నుంచి కాల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ రోజు సీఎంవోకు వచ్చారు.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరు పరిశీలిస్తోంది అధిష్టానం.. కానీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీంతో, చెవిరెడ్డి.. సీఎం వద్దకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక, నంద్యాల లోకసభ ఇంఛార్జ్ పై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.. అందులో భాగంగా సీఎంవోకు వచ్చారు పలువురు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు.. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాలకు చెందిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తదితరులు.. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా మైనారిటీ అభ్యర్థిని బరిలో పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది.. ఈ నేపథ్యంలో జిల్లా నేతలకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఇక, వైసీపీ అవనిగడ్డ పంచాయతీ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.. సీఎం వైఎస్ జగన్ ను కలిశారు అవనిగడ్డ నియోజకవర్గ ఇంచార్జ్ డా. సింహాద్రి చంద్రశేఖర్.. ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకోవటం డా. చంద్రశేఖర్‌కు ఆసక్తి లేదని ప్రచారం సాగగా.. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ సీఎంవో రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.