Site icon NTV Telugu

Pudi Srihari Arrest: పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన వైసీపీ.. హైకోర్టులో పిటిషన్‌..

Pudi Srihari Arrest

Pudi Srihari Arrest

Pudi Srihari Arrest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) పూడి శ్రీహరి అరెస్ట్‌పై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అరెస్ట్‌ను అక్రమంగా పేర్కొంటూ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ ఉదయం మఫ్టీలో వచ్చిన పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పకుండా శ్రీహరిని బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. ఏ పోలీస్ స్టేషన్‌కు చెందినవారో, ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదని విమర్శించారు. ఉదయం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో అడ్డగించి శ్రీహరిని తీసుకెళ్లారని తెలిపారు. ఆయన ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారని, ఇంటికి వెళ్లే అవకాశమూ ఇవ్వలేదని అన్నారు.

తర్వాత మరికొంత మంది పోలీసులు శ్రీహరి ఇంటికి వెళ్లి బలవంతంగా లోనికి ప్రవేశించి సోదాలు నిర్వహించారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న సహాయకుడిని బయటకు పంపించి, ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లినా లోపలికి రానివ్వలేదని అన్నారు అప్పిరెడ్డి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు పెరిగిపోయాయని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరిని అరెస్ట్ చేయడం అత్యంత హేయమని పేర్కొన్నారు.

మరోవైు చిత్తూరులో వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గురించి ప్రజలకు ఇప్పటికే తెలుసని, ఇలాంటి కేసులతో వైసీపీ కేడర్‌ను భయపెట్టలేరని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక, పూడి శ్రీహరి అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఈరోజే విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version