YS Sharmila met CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు. సరిగ్గా అరగంట పాటు షర్మిల, జగన్ కుటుంబాలు సమావేశం అయ్యాయి. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందజేశారు. అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు. అక్కడ విశ్రాంతి తీసుకుని.. రాత్రి 8.50 నిమిషాలకు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
Read Also: Nani vs Chinni: నాని వర్సెస్ చిన్ని.. తిరువూరులో అన్మదమ్ముల వర్గీయుల బాహాబాహీ
సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే..
షర్మిలతో పాటు తాడేపల్లిలోని సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. షర్మిల కాన్వాయ్ వెళ్లిన కాసేపటికి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యే ఆర్కే వచ్చారు. సమాచారం లేకపోవడంతో సీఎం ఇంటి వైపు ఆర్కే వాహనం వెళ్లకుండా పోలీసులు గేట్ వేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి ఆర్కేను పోలీసులు అనుమతించారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. “గన్నవరం నుంచి వస్తుండగా నా వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో షర్మిల కాన్వాయ్‌లో రాలేక పోయాను. సీఎం జగన్‌ను నేను కలవటం లేదు. వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నేను షర్మిల వెంటే నడుస్తా. షర్మిలతో పాటు ఎవరెవరు వస్తారనే విషయమై నాకు తెలియదు”అని ఆయన తెలిపారు.