NTV Telugu Site icon

YS Sharmila: కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక నిర్ణయం

Ys Sharmila Padayatra

Ys Sharmila Padayatra

YS Sharmila: డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు. బాధితులను హైదరాబాద్ తీసుకొచ్చారన్నారు. సీఎంను కలవడానికి వెళ్తే… ట్రాఫిక్ ఉల్లంఘన పేరుతో అరెస్ట్ చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పోలీసులను వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే… కేవలం టీఆర్ఎస్ నేతలకే ఫ్రెండ్లీగా ఉంటున్నారని ఆమె మండిపడ్డారు. 4వ తేదీన ఆగిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లడించారు. 14వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అంతకు ముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. దాడులు చేసినా, కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానన్నారు.

Jagga Reddy: కవిత, బీఎల్‌ సంతోష్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలి..

పోలీసుల బాధ్యతలను గుర్థు చేస్తూ… పాదయాత్రకు కోర్టు అనుమతి కాపీని డీజీపీకి అందజేశామన్నారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతోందని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు.. తాలిబన్లు అంటూ మండిపడ్డారు. పాదయాత్రను ఆపేది లేదంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రజల సమస్యలపై నిలదీస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి… కేసీఆర్ కుటుంబం ఆస్తులను పెంచుకుందని షర్మిల ఆరోపించారు. తన మీద విచారణ వేయండి.. అదే విచారణ వాళ్ల మీద కూడా చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం మళ్ళీ ఏర్పడుతుందని గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బీజేపీని ప్రశ్నిస్తున్నది, నిలదీస్తున్నది కేవలం వైఎస్ షర్మిల మాత్రమేనని.. బీజేపీకి దత్త పుత్రికను కానే కాదని ఆమె చెప్పారు. బయ్యారం గనులకు సంబంధించి తనకు సంబంధం లేదన్నారు. సంక్రాంతి తర్వాత.. తెలంగాణలో బస్సు యాత్ర చేస్తానని వైఎస్‌ షర్మిల ప్రకటించారు.