తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఎవరికీ ఏ స్కీమ్ ఇచ్చింది లేదు అని, మరి ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో తెలియదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకో అని, ఆలోచన మార్చుకో అని వైఎస్ జగన్ సూచించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ’18 వేల కోట్లు ప్రజలపై విద్యుత్ భారం మోపారు. ఏం పెరిగినా ఎవరూ మాట్లాడకూడదు, పెరిగిన బ్రతుకు బారం గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. నాణ్యత లేని పనులు జరిగినా.. ఒక్క రూపాయికే భూములు ఇస్తున్నా ప్రశ్నించకూడదు. మేం మంచి జరిగేలా పీపీఏలు చేసుకున్నా.. ఇవాళ 4.60 రూపాయలకు పీపీఏ చేసుకున్నా అడగకూడదు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ఆగేది లేదు. చంద్రబాబు పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత అన్నీ చెల్లిస్తాం. ఇండో సోల్ కంపెనీకి గతంలో చేవూరు, రావూరులో ఇచ్చాం. అక్కడ రైతులు సంతోషంగానే భూములు ఇచ్చారు. వాళ్ల కోసం సేకరించిన భూములు వాళ్లకు ఇవ్వలేదు. అక్కడ వాళ్లకు పొగపెట్టి కరేడు పొమ్మన్నారు. రెండు పంటలు పండే భూములు ఇవ్వటానికి రైతులు ఇష్టంగా లేరు. బీపీసీఎల్ ల్యాండ్ ఇవ్వాలనుకుంటే మరోచోట ఇవ్వొచ్చు కదా. కృష్ణపట్నం పోర్టులో రామోజీరావు బంధువులకు 10 వేల ఎకరాలు భూమి ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా చాలా భూమి అందుబాటులో ఉంది. ఫ్యాక్టరీలు రావాలనా లేదా వద్దనా? మీరు ఇదంతా చేస్తున్నారు. అనేక ఫ్యాక్టరీల యాజమాన్యాలు వీరి దెబ్బకు వెళ్లిపోతున్నారు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి సొమ్ము చేసుకోవాలని ఇదంతా చేస్తున్నారు’ అని జగన్ మండిపడ్డారు.
Also Read: YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం పోతుంది.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే!
‘గతంలో మెరుగైన పోలీసింగ్ ఉండేది. ఎవరి మీద వివక్ష చూపించకుండా సమస్యల పరిష్కారం జరిగేది. ఇవాళ పోలీస్ అధికారులు చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్టాయి అధికారి అయినా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. పీవీ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్ కుమార్, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ లాంటి అధికారులను వేధిస్తున్నారు. చాలా మంది పోలీస్ అధికారులకు అసలు పోస్టింగ్ లు లేవు. 8 మంది డీఎస్పీ లు సస్పెండ్, 80 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు పోస్టింగులు లేకుండా ఉన్నారు. ఏపీ డీఐజీ ఒక మాఫియా డాన్. ఒక నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడపాలన్నా ఎమ్మెల్యేకి కట్టే కప్పం కాకుండా పోలీసులు వసూలు చేస్తున్నారు. సగం వీళ్లు, మిగతా సగం పెద్దబాబు, చిన్నబాబుకు పంపిస్తున్నారు. ఇవన్నీ చూసి కొందరు ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. సిద్ధార్థ్ కౌశల్ లాంటి యువ అధికారి వేధింపుల వల్లే రాష్ట్రాన్ని, ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. డీఐజీలతో వసూళ్లు చేయించి మొత్తం తమ దగ్గరకు తెప్పించుకుంటున్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాలు ఎలా చేశారు?. రాజకీయ పార్టీల హక్కులు ఆయనకు తెలియవా?. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా?. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులకు గుడివాడ ఘటన అద్దం పడుతుంది. జెడ్పీ చైర్మన్ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్ళతో దాడి చేసిన ఘటన. ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతున్నా?. ఆమెపై ఎందుకు దాడి చేశారు, దుర్భాషలాడారో కూటమి నేతలు చెప్పాలి. చంద్రబాబును ప్రశ్నించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అక్కడకు వెళ్తుంది.. తప్పేంటి?. సాయంత్రం ఐదు గంటలకు మొదలైతే 6.30 వరకు దాడి ఘటన కొనసాగింది. తిడుతూ.. కొడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు’ అని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.