మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈరోజు పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అరటి రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంకు చేరుకుంటారు. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడిన అనంతరం జగన్ వేంపల్లికి చేరుకుంటారు. అక్కడ జెడ్పీటీసీ రవి కుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అటు తర్వాత ఇడుపులపాయ చేరుకొని.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం వైఎస్ జగన్ తాడేపల్లికి బయలుదేరి వెళతారు.