సినిమా డైలాగ్‌లు పోస్టర్లుగా పెట్టినందుకు కార్యకర్తలపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. నటులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్‌లు ఎక్కువ ఉంటాయని.. మీకు అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్లకు చెప్పి తీయించాలన్నారు. అసలు సెన్సార్ వాళ్లకు లేని అభ్యంతరం మీకు ఎందుకు? అని ప్రశ్నించారు. మంచి సినిమాలోని పాటలు పెట్టుకున్నా తప్పే.. డైలాగులు పెట్టుకున్నా తప్పే.. ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే.. ఏం చేసినా తప్పేనా? అని జగన్ అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకుని పాలన చేయటం సత్తా అని, అంతేతప్ప అన్యాయమైన పాలన చేస్తూ అక్రమ కేసులు పెట్టి స్టేషన్లో పెడుతున్నారు అని వైసీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు.
‘బీసీ మహిళకు ఆత్మగౌరవం లేదా?. జెడ్పీ చైర్మన్ హారికను, ఆమె భర్తను ఇష్టానుసారం కొడుతూ, తిడుతూ చేస్తుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు. ఇది శాడిజం కాకుంటే మరేంటి?. మీరే దాడి చేసి.. మీరు తప్పు చేసి.. ఆమెను మహానటి అంటారు. నిజంగా మహానటులు ఎవరు అన్నది ఘటన వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. పోలీసుల ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ హారికపై దాడి జరుగుతుంటే చూస్తున్నారు. ఎవరు మహానటులు. దాన వీర సూర కర్ణ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారు. చంద్రబాబు యాక్టింగ్ దెబ్బకు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎటో వెళ్ళిపోతుంది. ఈ ఘటనకు కారణమైన వాళ్లను పోలీసులు ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు. పేర్ని నాని ఏదో సినిమా డైలాగ్ మాట్లాడడట. పథకం పన్ని.. దారి కాసి దాడి చేశారు. హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. వెనుక సీట్లో కూర్చున్న హారిక భర్త మహిళను గుద్దాడంట. గవర్నమెంట్ కారులో వెళ్తున్న జెడ్పీ చైర్మన్ భర్త.. డ్రైవర్ ఉండగా ఎలా గుద్దుతాడు?’ అని జగన్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: YS Jagan: వార్నింగ్ ఇస్తున్నా, వడ్డీతో సహా చెల్లిస్తా.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!
‘పెడనలో సభ పెట్టిన అందరిపై కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా కేడర్ మీటింగులు పెట్టుకోకూడదా?. చంద్రబాబు మోసాలను ప్రశ్నించకూడదా?. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా?. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగినా బాధితులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా??. చంద్రబాబు ఏ పని చేసినా టాపిక్ డైవర్షన్ కోసమే. నా పర్యటనల్లో టాపిక్ డైవర్షన్ కోసం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రలు కనిపిస్తాయి. ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టిస్తారు. ఫిబ్రవరి 26న గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్ళా. మా ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధరలు వచ్చేవి.. ఇప్పుడా పరిస్థితి లేదు. వాళ్లకు సంఘీభావం తెలపటం తప్పా. జెడ్పీ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న నా సెక్యూరిటీ విత్ డ్రా చేసుకున్నారు. వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు.. ఇష్టం లేకుంటే తీసేస్తారు. ఏప్రిల్ 21న రాప్తాడుకు వెళ్ళాం. మా కార్యకర్త కురువ లింగయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళాం. జనం ఎక్కువై హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. ఆఖరికి ఆ హెలికాప్టర్ పైలెట్ ను విచారణ చేసింది రెడ్ బుక్ రాజ్యాంగం. మా పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు పెట్టారు. జూన్ 11న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్ళా. మా పర్యటన సమయంలో రాళ్ళు వేయించి టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కార్యక్రమానికి వచ్చిన 50 వేల మంది సంయమనం పాటించారు కాబట్టి వాళ్లకు ఏమీ కాలేదు. అయినా మూడు కేసులు పెట్టి 15 మందిని జైలుకు పంపారు. మేము పొగాకు రైతుల వద్దకు వెళ్తే మీకు నష్టం ఏంటి. మీరు చేయాల్సిన పనులు చేస్తే మేం వెళ్ళే పని ఉండదు కదా. ఇది చంద్రబాబు శాదిజం కాదా. రెంటపాళ్ళ పర్యటన సమయంలో చంద్రబాబు చేసిన రభస అంతా ఇంతా కాదు. ఆయన పర్యటనలకు జనం రావటం లేదని అక్కసు. జనానికి మంచి చేయటం లేదని వాళ్ళు రావటం లేదు. నా కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేయటం.. లాఠీ ఛార్జీలు చేయటం. కార్యక్రమానికి భద్రత కల్పించాల్సింది పోయి.. నా కార్యక్రమానికి రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు’ అని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు.
