‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ దాడిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈరోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి.. మురళీ స్వగ్రామం కల్లితండాకు చేరుకొని వీరజవాన్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించారు. మురళీ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని మాజీ సీఎం చెప్పారు.
Also Read: Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు అరెస్టు!
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. ‘వీరజవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలి. జవాను చనిపోతే రూ.50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం మా ప్రభుత్వం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోంది, అందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.