Site icon NTV Telugu

YS Jagan : రాష్ట్రంలో దుర్మార్గమైన రెడ్‌బుక్‌ పాలన జరుగుతోంది

Jagan

Jagan

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి నిలబడి ధైర్యంగా పోరాడిన ప్రజాప్రతినిధులందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు అత్యంత కష్టాల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఇది దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన. ప్రజావ్యతిరేకతను ఎంత అణిచివేయాలనుకున్నా సాధ్యం కాదు” అని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబునాయుడు పాలనలో అవినీతి విరుచుకుపడిందని, ప్రజలపై భారం పెడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీశారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలోని పాఠశాలలు, ఆసుపత్రులు నరకంగా మారాయని, బెల్టు షాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయంటూ ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైపోయినట్లు వివరించారు.

విశాఖలో ఉర్సా, లూలు, లిల్లీ వంటి కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను టెండర్లులేకుండా కట్టబెట్టడం దారుణమన్నారు. “ఊరుపేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల భూములు ఇస్తున్నారు. అమెరికాలో ఆఫీసు కూడా చిన్న ఇల్లే. ఇది భూముల దోపిడీ కాదు అనేదెవరు?” అని జగన్ ప్రశ్నించారు. 2018లో 36,000 కోట్ల విలువైన అమరావతి పనులను ఇప్పుడు 78,000 కోట్లకు పెంచారని, “టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి మిత్రులకే కట్టబెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ పేరుతో 8 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు” అని ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో 4 లక్షల పింఛన్లు తీయించారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజార్చారని జగన్ విమర్శించారు. జగన్ హయాంలో డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వెళ్లేవని గుర్తుచేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసిన జగన్, “జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను” అని స్పష్టం చేశారు. “చంద్రబాబునాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ప్రజలు మోసాన్ని గుర్తించి ఆయనను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేస్తారు” అని జగన్ హెచ్చరించారు.

Chandrayangutta: బాలుడి కిడ్నాప్.. గంటలో చేధించిన పోలీసులు

Exit mobile version