Instagram Reels: సోషల్ మీడియా మోజులో పడి యువత ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.. కొందరు అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇన్‌స్టా రీల్స్ మోజులో.. అందులోనూ కొత్తగా ట్రై చేయాలనే ప్రయత్నాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. తాజాగా తమిళనాడులో ఇన్‌స్టా రీల్స్ మోజులో.. ఓ యువకుడు చేసిన సాహసం.. అతడికి నరకం చూపించింది.. చివరకు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Read Also: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 60 మంది మృతి
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలోని కొండా ప్రాంతాలలో ఓ ఘటన జరిగింది.. రీల్స్ వీడియోలు చేస్తూ వందల అడుగుల ఎత్తులో ఉన్న కొండరాళ్లపై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు.. అయితే, వీడియోలు తీస్తూ ఒక్కసారిగా కొండపై భాగం నుంచి కింద పడిపోయి బండరాళ్ల మధ్య చిక్కుకున్నాడు.. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. యువకుడిని కాపాడటానికి రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. అతికష్టం మీద కొండల మధ్య చిక్కుకున్న యువకుడిని కాపాడటానికి ప్రాణాలకి తెగించి విశ్వప్రయత్నాలు చేశారు రెస్క్యూ సిబ్బంది. యువకుడిను రెండు కర్రలకి బలంగా కట్టి కొండరాళ్ళపై నుంచి ఎంతో చాకచక్యంగా కాపాడారు.. అక్కడి నుంచి డోలి సహాయంతో కిందకి తీసుకొచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు రెస్క్యూ సిబ్బంది. కానీ, యువకుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడం, మరోవైపు తల భాగంలో బలమైన గాయం కావడంతో యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇలా వీడియోల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయితే, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.