NTV Telugu Site icon

Arvind Kejriwal: బెయిల్ ఇస్తే అధికారిక విధులు నిర్వహించొద్దు.. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు సూచన

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే.. అధికారిక విధులను నిర్వహించొద్దని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుతో సంబంధం ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా అరవింద్‌ కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని న్యాయస్థానం సూచించింది.

Read Also: China Knife Attack: ఆసుపత్రిలో కత్తితో దాడి.. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

విచారణ సందర్భంగా, మధ్యంతర బెయిల్‌పై విడుదలైతే కేజ్రీవాల్ కార్యాలయానికి హాజరవుతారా, ఫైళ్లపై సంతకం చేస్తారా.. “ఇతరులకు ఆదేశాలు ఇస్తారా” అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, కేజ్రీవాల్ ఎక్సైజ్ కేసుతో వ్యవహరించడం లేదు. ఆయన సిట్టింగ్ ముఖ్యమంత్రి” అని అన్నారు. ఈ నేపథ్యంలో ఆప్‌ అధినేతను బెయిల్‌పై విడుదల చేయాలని నిర్ణయించుకుంటే.. “మీరు అధికారిక విధులను నిర్వహించకూడదని మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఎందుకంటే ఇది క్యాస్కేడింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది” అని బెంచ్ పేర్కొంది. కేజ్రీవాల్ “ఢిల్లీ సిట్టింగ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందున” బెయిల్ వాదనలు వింటామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి సుప్రీం కోర్టు తెలిపింది.

Read Also: Pm Modi: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు

అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది “సాధారణ పౌరులతో పోలిస్తే రాజకీయ నాయకుడికి ప్రత్యేక హక్కులు లేవు. ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ బెయిల్‌పై విడుదల చేయాలా? కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇక, ఈ కేసులో కేజ్రీవాల్‌ దర్యాప్తునకు సహకరించలేదు. ఆరు నెలల్లో 9 సమన్లను పట్టించుకోలేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది” అని దర్యాప్తు సంస్థ ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం బెయిల్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.