Today (28-01-23) Business Headlines:
పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు
గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి. దీంతో జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 42 కోట్ల 13 లక్షలకు చేరింది. ఎయిర్’టెల్ కస్టమర్ల మొత్తం సంఖ్య 36 కోట్ల 60 లక్షలకు పెరిగింది. వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 24 కోట్ల 37 లక్షలకు పరిమితమైంది.
ఎయిరిండియాను ‘టాటా’ కొని ఏడాది
ఎయిరిండియాను టాటా గ్రూపు కొనుగోలు చేసి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో సంస్థ చెప్పుకోదగ్గ వృద్ధి సాధించినట్లు ఎయిరిండియా CEO క్యాంబెల్ విల్సన్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన పురోగతికి సంబంధించిన ప్రణాళికలను విహాన్ డాట్ ఏఐ పేరిట సిద్ధం చేసింది. విమానాల్లో మార్పులు చేర్పుల కోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చుచేయనున్నామని విల్సన్ తెలిపారు. ఏడాది కాలంలో ఎయిరిండియా విమానాల సంఖ్య 100కు చేరినట్లు వెల్లడించారు. కొత్తగా 16 ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు.
2 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు ఆవిరి
ఇండియన్ స్టాక్ మార్కెట్’కి నిన్న శుక్రవారం బ్యాడ్ ఫ్రైడేగా మారింది. సెన్సెక్స్ గత నెల రోజుల కాలంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది. నిఫ్టీది కూడా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 16 వందల 47 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల సంపదను నష్టపోయారు. బ్యాంకింగ్ షేర్లు డీలా పడ్డాయి. అమ్మకాల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. మరో వైపు.. హిండెన్’బర్గ్ రిపోర్టు నేపథ్యంలో గౌతమ్ అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా క్షీణించటం దీనికి మరో కారణం.
ఆయుష్మాన్ నిధులు ప్రైవేట్’కివ్వండి
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన నిధులను ప్రత్యేకంగా ప్రైవేట్ రంగానికి కేటాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కొత్త బడ్జెట్’ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఈ కీలక అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఆయుష్మాన్ భారత్’లో ప్రస్తుతం ఇస్తున్న ఫండ్స్ దాదాపు 12 వేల కోట్ల రూపాయలని, ఈ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ స్థాయిలో సుమారు ఒకటీ పాయింట్ 6 లక్షల కోట్లకు పెంచాలని సూచించింది.
గోల్డ్’మ్యాన్ శాక్ సీఈఓ పేప్యాకేజీ కట్
గోల్డ్’మ్యాన్ శాక్ కంపెనీ CEO డేవిడ్ సోలోమాన్ పేప్యాకేజీలో 30 శాతం కోత పడింది. 2021వ సంవత్సరంలో ఆయన పనితీరు ఆధారిత పేప్యాకేజీ 35 మిలియన్ డాలర్లు కాగా అది 2022వ సంవత్సరంలో 25 మిలియన్ డాలర్లకు పడిపోయింది. బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు కాగా అందులో ఎలాంటి మార్పూ లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’కి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మోర్గాన్ స్టాన్లీ CEO శాలరీ కూడా కట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గోల్డ్’మ్యాన్ శాక్ సంస్థ సైతం ఇదే నిర్ణయం తీసుకోవటంతో ప్రస్తుత ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో లేఆఫ్’ల మాదిరిగానే ఇదొక ట్రెండ్’గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజ్ జీవీకే మంచి త్రైమాసిక పనితీరు
తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మంచి పని తీరు కనబరిచింది. ఆదాయంలో, లాభంలో గణనీయమైన వృద్ధి సాధించింది. డిసెంబర్ త్రైమాసికంలో 105 కోట్ల రూపాయల రెవెన్యూని, 17 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో ఆదాయం 82 కోట్లు కాగా నికర లాభం 12 కోట్లు మాత్రమే. తాజ్ జీవీకే గత తొమ్మిది నెలల్లో మొత్తం 65 కోట్ల రూపాయల లాభాన్ని గడించింది. కార్పొరేట్ జర్నీలు, సోషల్ సెలబ్రేషన్స్ పెరగటం వల్లే ఈ గ్రోత్ సాధ్యమైందని సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి చెప్పారు.