వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలారు. బొత్స అస్వస్థతకు గురవడంతో వైసీపీ నేతలు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. గరివిడి నుంచి విజయగరంకు బొత్స బయల్దేరారు.
వైసీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మైకులో మాట్లాడుతుండగానే ఆయన ఒక్కరిగా సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ నేతలు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎండ, వేడి ఎక్కువగా ఉండటంతో బొత్స వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది.
Also Read: HHVM Postponed: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హరిహర వీరమల్లు వాయిదా లాంఛనమే!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేశారని వైసీపీ ఉద్యమబాట పట్టింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన (జూన్ 4) ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంతో నిరసనలకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలుపుతున్నారు.