టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని.. అలాగే, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అష్ఠ ద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మీ, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం రెండో రోజు విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది. రెండో రోజు సుదర్శన చక్ర యాగంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు- జ్ఞానేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడి కృపతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా.. అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మీ, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం రేపటితో (ఫిబ్రవరి28) ముగియనుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ- జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.