Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu: ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu: ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఏపీలో వైఎస్‌ జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే అని హెచ్చరించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారు. 2023-24 లో ఆర్బీఐ నుంచే కేవలం మంగళవారం అప్పులే రూ.70 వేల కోట్లు చేశారని.. జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు రూ.257 కోట్లు చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు బహిరంగ మార్కెట్‌లో అప్పులు చేసిందని విమర్శించారు. శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు ఇవి రెండింతలు ఎక్కువ. రాబోయే ప్రభుత్వాల అప్పులను సైతం జగన్ రెడ్డే చేయాలనుకుంటున్నాడు. ఎన్నికల కోడ్ ఉండగానే 2024-25 ఆర్ధిక సంవత్సరం అప్పులలో రూ.20 వేల కోట్లు జూన్ 4 లోపే చేసేయాలని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు.

Read Also: KTR: కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

ఇక, రాష్ట్రాన్ని ఆర్ధిక అధోగతి పాలుకాకుండా కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్ రెడ్డిని ఓడించాల్సిందే అని పిలుపునిచ్చారు యనమల రామకృష్ణుడు.. అప్పులతో కొనసాగే సంక్షేమ రాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. పేదలను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించాలంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని సూచించారు. కాగా, గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే. ఎన్నికల తరుణంలో మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు యనమల.

Exit mobile version