కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రూ.3,700 కోట్లు లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. 2029 ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని యనమల చెప్పారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ మహానాడుకు యనమల రామకృష్ణుడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘కేసులన్నీ తేలితే వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకున్నాడు. రాష్ట్ర ఖజానాను పాడుచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రూ.3700 కోట్ల లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా జగన్ ఇంటికి వెళ్లింది. రూ.1300 కోట్ల ఇసుక సొమ్ము దోపిడీకి గురైంది’ అని యనమల చెప్పారు.
Also Read: AP Cabinet: రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
‘గత ప్రభుత్వ హయాంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారు. రూ.లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఖజానాను గాడిలో పెట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల తర్వాతే ఉంటుంది. 2029 ఎన్నికల ముందు జరిగే అవకాశం ఏమాత్రం లేదు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తయారవుతోంది’ అని యనమల రామకృష్ణుడు తెలిపారు.