world’s Biggest Party: వాస్తవానికి ఈ రోజుల్లో పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సినీ తారల ఆధ్వర్యంలో నిర్వహించేవి, లేదా అరబ్ షేక్‌లు ఏర్పాటు చేసే వేడుకలు. కానీ ఈ పార్టీలను తలదన్నేలా వేల ఏళ్ల క్రితం నిర్వహించిన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గురించి మీకు తెలుసా.. ఈ పార్టీని పురాతన ఇరాకీ నగరమైన కల్హులో నిర్వహించారు. ఈ పురాతన కాలం నాటి పార్టీ గురించి తెలుసుకుంటే బాబోయ్ ఏంది బయ్యా దీని రేంజ్ అని ఆశ్చర్యపోతారు. చరిత్రలో “గొప్పతనం” అనే పదానికి అర్థాన్ని నిర్వచించిన 3 వేల ఏళ్ల క్రితం నాటి ఈ విందు గురించి మీకు తెలియకపోవచ్చు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Srinivas Goud : సిగ్గుంటే అలా ప్రచారం చేయరు.. ఫాల్తు రాజకీయం చేస్తున్నారు
రాజా మజాకా!
ఈ పార్టీ అస్సిరియన్ పాలకుడు అషుర్నసిర్పాల్ II ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ విందు కేవలం ఆహార వేడుక మాత్రమే కాదు, శక్తి, శ్రేయస్సు, సామ్రాజ్య ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటు చేసింది. క్రీస్తుపూర్వం 879లో పురాతన ఇరాకీ నగరమైన కల్హు (ప్రస్తుత నిమ్రుద్)లో ఈ రాజు తన కొత్త రాజభవనం ప్రారంభోత్సవంలో భాగంగా 10 రోజుల పార్టీని ఇచ్చారు. చరిత్రకారులు దీనిని “ప్రపంచంలో మొట్టమొదటిగా సారి నమోదు చేసిన మెగా-పార్టీ” అని పేర్కొన్నారు. ఈ పార్టీలో భాగంగా రాజును స్వాగతించే శాసనం అయిన బాంకెట్ స్టీల్ ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఈ శాసనం రాజు నిర్వహించిన గొప్ప విందును వివరిస్తుంది. అయితే చాలా మంది ఈ విందు విషయాన్ని అతిశయోక్తిగా అభివర్ణించారు. ఈ శాసనం ప్రకారం.. ఈ విందుకు రాజు మొత్తం 69,574 మంది అతిథులను ఆహ్వానించాడు. ఈ సంఖ్య చాలా కచ్చితంగా కనిపిస్తుంది. ఈ విందులో పాల్గొన్న వాళ్లలో మొత్తం సామ్రాజ్యం నుంచి 47,074 మంది సాధారణ పౌరులు, 5 వేల మంది విదేశీ రాయబారులు, వ్యాపారుల నుంచి రైతుల వరకు కల్హులోని 16 వేల మంది స్థానిక నివాసితులు, 1,500 మంది రాజభవన అధికారులు పాల్గొన్నారని చరిత్రకారులు చెబుతున్నారు.
10 రోజులు కొనసాగిన వేడుక
ఈ విందులో పాల్గొన్న అతిథులకు 10 రోజుల పాటు భోజనం, పానీయంతో కూడిన దావత్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గౌరవాలు లభించాయి. మొదట వారికి స్నానం చేయించి, తరువాత సువాసనగల నూనెతో మసాజ్ చేసి, రాజు సేవకులు చేతులు జోడించి స్వాగతించారు. భోజనం తర్వాత, వారిని బహుమతులతో పంపించారు. ఈ వేడుకలను విశాలమైన ప్రాంగణంలో టార్చెస్ వెలుగులో నిర్వహించారు. గాలి సుగంధ ద్రవ్యాలు, పండ్ల సువాసనతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయిందని చరిత్రకారులు వెల్లడించారు. వేడుకలో ఎక్కువ భాగం ఆరుబయట జరిగిందని, ఎందుకంటే ఉన్నత అతిథులను మాత్రమే రాజభవనంలోకి అనుమతించారని చెప్పారు.
పురావస్తు శాస్త్రవేత్త నురిత్ గోషెన్ మాట్లాడుతూ.. “వాస్తవానికి ఈ సంఖ్య అతిశయోక్తి కావచ్చు, కానీ ఇది రాజు పరిధిని చూపిస్తుంది. ఇక్కడ అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే వారు ఆ సంఖ్యను ఎలా లెక్కించారు. గేటు ప్రవేశ ద్వారం వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడా?” అని అన్నారు.
మెనూలో స్పెషల్ ఏంటి?
ఆ శిలాఫలకంపై చెక్కిన జాబితా ప్రపంచంలోని మొట్టమొదటి “మెనూ” లాగా ఉంది. మెనూలో మాంసం ప్రధానమైనది, అందులో 1,000 లావుపాటి ఎద్దులు, 10 వేల గొర్రెలు, 15 వేల గొర్రె పిల్లలు, 500 జింకలు, 500 గజెల్లు, 1,000 బాతులు, 10 వేల చేపలు ఉన్నాయి. అలాగే 10 వేల గుడ్లు, 10 వేల రొట్టెలు, 10 వేల బీరు పాత్రలు, 10 వేల వైన్ తొక్కలు కూడా మెనూలో భాగంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ విందు కేవలం ఒక వేడుక కాదు. అస్సిరియన్ సామ్రాజ్యం శక్తి, దాతృత్వాన్ని ప్రదర్శించడానికి ఒక రాజకీయ సందేశంగా పరిగణించినట్లు వెల్లడించారు. ఆ శిలాఫలకం ఒక ప్రచార స్టంట్ లాంటిదని, రాజు తన విజయాల గురించి (450 సింహాలను చంపడం, 30 ఏనుగులను బంధించడం!), నగరాలను నిర్మించడం, దేవతల అనుగ్రహాన్ని ప్రగల్భాలు చేయడం గురించి ఇందులో రాశాడు. విదేశీ రాయబారులను ఆహ్వానించడం ద్వారా, తన సామ్రాజ్యం చాలా సంపన్నమైనదని, అది 70 వేల మందికి 10 రోజులు ఆహారం ఇవ్వగలదని ఆయన ఈ విందు ద్వారా ప్రదర్శించాడని చరిత్రకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Khyber Pakhtunkhwa: పాక్ చేతుల్లొంచి జారిపోతున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ? .. దాయాది దేశంలో ఏం జరుగుతుంది!