Donald Trump: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువు అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్. తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా తన సంపాదనతో మరోమారు సంచలనం సృష్టించారు. తాజాగా వెలువడిన న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన ట్రంప్ గత ఏడాది క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి సుమారు $1.4 బిలియన్లు (సుమారు రూ. 12,810 కోట్లు) సంపాదించారు. ట్రంప్ తన క్రిప్టోకరెన్సీ వెంచర్‌ల నుంచి గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించారని ఈ నివేదికలు వెల్లడించాయి. జనవరి 2025లో వైట్ హౌస్‌కు వచ్చినప్పటి నుంచి ట్రంప్ సంపద కనీసం $1,408,500,000 పెరిగిందని ఈ నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికాలో సగటు కుటుంబ ఆదాయం సుమారు $83,000 (రూ.76,70,860). ఈ ఆదాయం క్రమంగా తగ్గుతోంది. కానీ ట్రంప్ కేవలం 12 నెలల్లోనే సంపాదించిన సంపద సగటు అమెరికన్ కుటుంబ ఆదాయం కంటే 16,720 రెట్లు ఎక్కువ.
READ ALSO: Terror Threatsషాకింగ్.. రిపబ్లిక్ డే రోజు భారత్‌పై భారీ ఉగ్రదాడికి ప్లాన్! కట్‌చేస్తే..
20 వేర్వేరు విదేశీ ప్రాజెక్టులకు “ట్రంప్” బ్రాండ్‌కు లైసెన్స్ ఇవ్వడం ద్వారా అధ్యక్షుడు ట్రంప్ 23 మిలియన్ డాలర్లు సంపాదించారని సమాచారం. వీటిలో ఒమన్‌లో ఒక లగ్జరీ హోటల్, సౌదీ అరేబియాలో ఒక గోల్ఫ్ కోర్సు, మహారాష్ట్రలో ఒక ఆఫీస్ టవర్ ఉన్నాయి. పూణేలోని “ట్రంప్ వరల్డ్ సెంటర్” భారతదేశంలో ట్రంప్-బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది ట్రంప్‌కు $289 మిలియన్లకు పైగా సంపాదిస్తుందని అంచనా. నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి కేవలం రియల్ ఎస్టేట్ నుంచి మాత్రమే డబ్బు సంపాదించలేదు. గత సంవత్సరంలో ట్రంప్‌కు అతిపెద్ద ఆదాయ వనరు ఆయన క్రిప్టోకరెన్సీ వెంచర్లే. ఆయన, తన కుటుంబ-సంబంధిత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీ, ఒక మీమ్ కాయిన్ ద్వారా కనీసం $867 మిలియన్లు సంపాదించారని పలు నివేదికలు వెల్లడించాయి.
2025లో ఒక UAE సంస్థ ట్రంప్ మద్దతుగల వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే సంస్థలో $2 బిలియన్లు పెట్టుబడి పెట్టింది. ట్రంప్ ఆ దేశ సెమీకండక్టర్ చిప్‌లను UAEకి విక్రయించడానికి ఆమోదం తెలిపిన కొన్ని వారాల ముందు ఇది జరగడం విశేషం. ట్రంప్ ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు పాకిస్థాన్ “అబద్ధాలు” చెబుతోందని, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల పేరుతో అమెరికాను “మోసగించిందని” ఆరోపించారు. కానీ అదే ట్రంప్ ఇప్పుడు రూ.17 వేల కోట్ల విలువైన ప్రధాన క్రిప్టో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా పాకిస్థాన్‌కు దగ్గరయ్యారు. నిజానికి ట్రంప్, ఆయన కుమారులు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌లో $5 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన వాటాలను కలిగి ఉన్నారు. ఇది క్రిప్టోను ట్రంప్ కుటుంబానికి అతిపెద్ద సంపద వనరుగా మార్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వీటికి అదనంగా ట్రంప్ – ఆయన భార్య మెలానియా చిత్రనిర్మాణంలో భారీ సంపాదించారని చెబుతున్నారు. రాబోయే వారి డాక్యుమెంటరీ “మెలానియా” హక్కుల కోసం అమెజాన్ నుంచి సుమారుగా వారు $28 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. అదనంగా X, Meta, YouTube, Paramount వంటి టెక్, మీడియా సంస్థలు దావాలను పరిష్కరించడానికి ట్రంప్‌కు మొత్తం $90.5 మిలియన్లు చెల్లించాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ ఛానెల్ సస్పెన్షన్‌పై దావాను పరిష్కరించడానికి YouTube $24.5 మిలియన్లు చెల్లించగా, కమలా హారిస్‌తో ఇంటర్వ్యూను సవరించారనే ఆరోపణలతో పారామౌంట్ $16 మిలియన్లు పే చేసింది. అలాగే ట్రంప్ ఖతార్ నుంచి “ప్యాలెస్ ఆన్ వీల్స్” అని పిలిచే $400 మిలియన్ల ఖరీదైన విమానాన్ని బహుమతులను అందుకున్నారు. ఈ జెట్‌ను అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించాలని భావిస్తున్నాడు, ట్రంప్ తన పదవిని విడిచిపెట్టిన తర్వాత కూడా దానిని తన వద్ద ఉంచుకుంటానని సూచించాడు. ఆసక్తికరంగా ట్రంప్ ఆర్గనైజేషన్ దోహాలో లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ నిర్మించడానికి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఖతార్ నుంచి ఆయనకు ఈ బహుమతి వచ్చినట్లు సమాచారం.
READ ALSO: MS Dhoni: ఎవరు గెలిచినా నా జట్టు సీఎస్కేనే.. ఆర్సీబీ ఐపీఎల్ తొలి ట్రోఫీపై ధోనీ కామెంట్స్ వైరల్