పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా ఆవిర్భవిస్తోందని, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనలో పౌరుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. రాబోయే పాతికేళ్లు భారత్‌కు మరింత కీలకమన్నారు. ప్రపంచానికి భారత్ పరిష్కారాలు చూపేలా తయారైందన్నారు. అలాగే మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, సైన్యంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Threat Call : సీఎంను చంపేస్తాం.. ఢిల్లీనుంచి బెదిరింపు కాల్
నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోందని..వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపది చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులకు ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలతో పాటు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. పేదరికం లేని భారత్ నిర్మాణంం కోసం కృషి జరుగుతోందని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే భారత్ డిజిటల్ నెట్‌వర్క్ ప్రపంచానికే ఆదర్శంగా మారిందని కొనియాడారు.
Union Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి
భారత్ డిజిటల్ ఇండియా వైపు పరుగులు పెడుతోందని, సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పౌరుల ఆరోగ్యం, జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు వంటి పథకాలతో ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందన్నారు. అవినీతి రహిత భారత్ కోసం కృషి చేస్తున్నామని ఈ క్రమంలోనే ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు ఓ విప్లవాత్మన నిర్ణయమని కొనియాడారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టామని గుర్తుచేశారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని మరికొన్ని హైలైట్స్
75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తిచేసుకున్నాం. కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు నిర్వహించుకున్నాం. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భర్ భారతంగా తీర్చిదిద్దాలి.
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. మూడు కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించాం. నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది.
తొలిసారి దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకుంటున్నాం. సైన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించాం. మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. బేటీ బచావో – బేటీ పడావో విజయవంతమైంది.
ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టాం.
అండమాన్ దీవులకు పరమ్‌వీర్ చక్ర పురస్కారాల గ్రహీతల పేర్లు పెట్టాం.
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్యక్రమాలతో మన రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయి. నేడు ఐఎన్‌ఎస్ విక్రాంత్ లాంటి స్వదేశీ విమాన వాహకనౌక మన నావికాదళంలో చేరింది.
ఓవైపు యాత్ర స్థలాలు, చారిత్రక వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతూనే.. మరోవైపు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాం. ప్రపంచంలోనే అంతరిక్ష శక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రైవేటు ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ఇప్పుడు ప్రపంచం అర్థం చేసుకుంటోంది. అందుకే ఉగ్రవాద అంశంలో మన సూచనలను ప్రపంచదేశాలు కీలకంగా పరిగణిస్తున్నాయి.
ఈ రోజు జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. జీ20 సభ్య దేశాలతో కలిసి ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
పురాతన కాలం నుంచీ ఉన్న యోగా, ఆయుర్వేద జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచ ఔషధ కేంద్రంగా మారుతున్నాం.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ రైల్వే నెట్‌వర్క్‌గా భారత రైల్వే వేగంగా దూసుకెళ్తోంది.