ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ 2025 ఛాంపియన్‌షిప్ జూన్ 30న ప్రారంభం కానుంది. జులై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. వింబుల్డన్ కోసం ఇప్పటికే ప్లేయర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈసారి వింబుల్డన్ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. టోర్నీ నగదు బహుమతిని రూ.610 కోట్లు (53.5 మిలియన్స్)గా నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వింబుల్డన్ 2024తో పోలిస్తే.. ఈసారి 7 శాతం అధికం.
వింబుల్డన్ 2025 విజేతగా నిలిచే ప్లేయర్‌కు రూ.34 కోట్ల ప్రైజ్‌మనీ అందించనున్నారు. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 11.1 శాతం ఎక్కువ. గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ. వింబుల్డన్ 2025 టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన ప్రైజ్‌మనీ దక్కుతుంది. తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు రూ.76 లక్షల దక్కనున్నాయి. ఇది 10 శాతం పెరుగుదల. ప్రపంచ టాప్ 20లో ఉన్న అనేక మందితో సహా అగ్రశ్రేణి ప్లేయర్స్ గ్రాండ్ స్లామ్ ఆదాయంలో ఎక్కువ వాటాను అడగడంతో ప్రైజ్‌మనీని పెంచాల్సి వచ్చింది.
Also Read: Netherlands: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పసికూన నెదర్లాండ్స్.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
వింబుల్డన్ ప్రైజ్‌మనీని పెంచినందుకు గర్విస్తున్నాం అని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ డైరెక్టర్ డెబోరా జెవాన్స్ పేర్కొన్నాడు. ‘వింబుల్డన్ ప్రైజ్‌మనీని పెంచినందుకు మేం గర్విస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి నగదు బహుమతి పెంచుతూ వస్తున్నాం. గతేడాదితో పోలిస్తే ఈసారి 7 శాతం పెంచాం’ అని జెవాన్స్ తెలిపాడు. వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్స్ సమయాలను మార్చారు. గతంలో కంటే రెండు గంటలు ఆలస్యంగా జరుగుతాయి. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (ఐఎస్‌టీ రాత్రి 8:30 గంటలకు) మార్చారు. డబుల్స్ ఫైనల్స్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు (ఐఎస్‌టీ సాయంత్రం 5:30 గంటలకు) ప్రారంభమవుతాయి.