NTV Telugu Site icon

Budget 2024: ఈ బడ్జెట్ లో రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేనా..? వృద్ధుల విజ్ఞప్తి ఏంటి..?

Budget 2024

Budget 2024

భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అటువంటి పరిస్థితిలో.. ఈ సాధారణ బడ్జెట్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రైలు టిక్కెట్లపై వారికి ఇచ్చిన 50 శాతం రాయితీని పునరుద్ధరించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రైలు టిక్కెట్‌లపై సీనియర్ పురుష సీనియర్ సిటిజన్లు రైలు టికెట్లపై 40 శాతం వరకు రాయితీని పొందేవారు. మహిళా సీనియర్ సిటిజన్లకు టిక్కెట్‌లపై 50 శాతం రాయితీ ఉండేది. 2019 చివరి వరకు.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు ఛార్జీల రాయితీలను అందించింది. రాజధాని రైలులో మొదటి ఏసీ టికెట్ ధర రూ. 4,000 అయితే.. సీనియర్ సిటిజన్లకు ఇది కేవలం రూ.2,000 లేదా రూ. 2,300 మాత్రమే లభించేది.

READ MORE: Manish Sisodia: మనీష్ సిసోడియాకు నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

2019 చివరి నుంచి కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో.. రైలు సేవలు నిలిచిపోయాయి. తరువాత వాటిని పునరుద్ధరించారు. కానీ తక్కువ ప్రయాణీకుల ప్రయాణం కారణంగా.. రైల్వే భారీ నష్టాలను చవిచూసింది. దీంతో రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్‌లకు భారత రైల్వే రాయితీని నిలిపేసింది. కొవిడ్ పరిస్థితిలో నష్టాల కారణంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే శాఖ మళ్లీ రాయితీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు ఎలాగైనా రాయితీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.