BTech Ravi Counter to Satish Reddy: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. ‘చావు దగ్గరకు వస్తే ఒక చేయి మీసం మెలేస్తా’ అనే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైలాగులు ఎందుకు? అని విమర్శించారు. ధైర్యవంతుడు, పెద్ద డైలాగ్స్ కొట్టే సతీష్ రెడ్డి వేల్పుల ఘటనలో ఎందుకు దాక్కున్నావు? అని ప్రశ్నించారు. వేల్పుల కాల్పుల ఘటనలో గన్‌మెన్ ఫైర్ చేశారా, లేక నువ్వే గన్ లాక్కుని ఫైర్ చేశావా సమాధానం చెప్పాలి? అని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుతో చెప్పి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డికి ప్రమేయం లేదని చంద్రబాబు నాయుడికి చెప్పి కేసులో లేకుండా చేశాం అని బీటెక్ రవి గుర్తుచేశారు. బీటెక్ రవి, సతీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.
‘సతీష్ రెడ్డి, నేను 20 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో పనిచేశాం. ఆయనపై మాట్లాడటానికి సంశయించి ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మేము కాదు మొరిగేది, నారా లోకేష్ అనే ఏనుగును చూసి వైసీపీ వారు మొరుగుతున్నారు. దొంగల సామెత కూడా సతీష్ రెడ్డికి తెలియదు. మేము ఆయన దగ్గరకు వెళ్లలేదు. పార్టీని వీడే రోజు ఏర్పాటు చేసిన విందుకు చాలా మంది రాలేదు. ఆరోజు టీడీపీలో అన్యాయం జరిగిందని కేడర్‌కు చెప్పినా.. వారు టీడీపీలోనే ఎందుకు ఉన్నారు. సతీష్ రెడ్డి స్వార్థం కోసం పార్టీ మారాడు. రామలింగా రెడ్డి హత్య కేసు ప్రస్తావించారు. మాది ప్యాక్షన్ ఫ్యామిలీ అని ఎన్నో సందర్భాల్లో చెప్పా. రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి ముద్దాయి. ఆ విషయాన్ని ఒప్పుకుంటారా?. పదవి కోసం హత్య చేశారని మాట్లాడటం విడ్డూరం. ఎంపీపీ పదవి కోసం గొడవ జరిగితే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి చనిపోలేదా?. నువ్వు చేస్తే సంసారం.. మేము చేస్తే ఇంకోటా?’ అని బీటెక్ రవి ఎద్దేవా చేశారు.
Also Read: KTR Birthday: కేటీఆర్ జన్మదిన వేడుకలు.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ సస్పెండ్!
‘వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డికి ప్రమేయం లేదని చంద్రబాబుతో చెప్పి కేసు లేకుండా చేశాం. వేంపల్లిలో సొంత పోలింగ్ బూతులో కనీసం ప్రభావం చూపలేదు. అలాంటి వ్యక్తిని నారా లోకేష్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ బాబును ఇస్తానుసారంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటే భౌతిక దాడి చేస్తామని కాదు. వేంపల్లి నాలుగు రోడ్లలో మంచం వేసుకుని పడుకో.. నీకు మేము భద్రత కల్పిస్తాం. సతీష్ రెడ్డికి ముప్పు ఉన్నది వైసీపీ నేతలతో.. మాతో కాదు. వేల్పుల కాల్పుల ఘటనలో కూడా సతీష్ రెడ్డిని చంద్రబాబు కాపాడారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. చావు దగ్గరకు వస్తే ఒక చేయి మీసం మెలేస్తా అనే రాజమౌళి డైలాగులు ఎందుకు. మరి అలాంటి సతీష్ రెడ్డి వేల్పుల ఘటనలో ఎందుకు దాక్కున్నాడో. ఏడు ఎన్నికలు పులివెందులలో సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా మెజారిటీ వచ్చిందని చెప్పగలరా?. వేల్పుల కాల్పుల ఘటనలో గన్‌మెన్ ఫైర్ చేశారా.. లేక నువ్వే గన్ లాక్కుని ఫైర్ చేశావా సమాధానం చెప్పాలి. ఈ రెండిటికి సమాధానం చెబితే తరువాత మేం మాట్లాడతాం’ అని బీటెక్ రవి పేర్కొన్నారు.