Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆనాటి నుంచి నరక చతుర్దశి, దీపావళి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారని అనేక పురాణ కథలు సైతం ఉన్నాయి. లక్ష్మీదేవి ఆవిర్భావం, పాండవులు అజ్ఞాతవాసం నుంచి రావడం, రావణుడి సంహారం తర్వాత రాముడు అయోధ్యకు విచ్చేయడం వంటివి అన్నీ కూడా దీపావళి పండుగతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి, దీపావళి ప్రధానంగా దీపాల పండుగ కావునా, ఈ రోజు దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించడం సంప్రదాయంగా వస్తుంది.
ఇక, నరక చతుర్దశి, దీపావళి రోజు చేసే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘నరక’ అనే శబ్దానికి యమలోకం అనే అర్థం వస్తుంది, అందుకే నరక విముక్తికై యమధర్మరాజు అనుగ్రహం కోసం యమ దీపాలు పెట్టి, పూజించాలని వ్రత చూడామణిలో తెలిపారు. యమయా ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ’ అని పురాణాల్లో ఉన్నాయి. అంటే జనులందరికి నరక బాధలు లేకుండా చేయడమే దీపావళి యొక్క ఆంతర్యమని మీనింగ్. ఇక, దీపం వెలిగించే సమయంలో ఈ మంత్రాన్ని చదవాలి. అలాగే, దీపావళి రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.. దీపాలు వెలిగించడం ద్వారా ఆమెను ఆహ్వానించి, తమ ఇళ్లను ధనం, ధాన్యం, సంతోషం నింపమని భక్తులు వేడుకుంటారు.
Read Also: IRCTC: దేవుడా.. తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను కడిగి.. మళ్లీ ప్యాకింగ్..
దీపం జ్యోతి పరబ్రహ్మ!
దీపం జ్యోతి జనార్దనః
దీపోన హరతు మే పాపం
సంధ్యా దీపం నమోస్తుతే!
అనే శ్లోకాన్ని చదువుతూ దీపావళి నాటి సాయంత్రం దీపాలను ముట్టించాలి. అన్ని పండుగలు సాయంత్రానికి ముగిస్తే దీపావళి సంబరాలు మాత్రం సాయంత్రం తర్వాతే ప్రారంభం అవుతాయి.