సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి కీలక భేటీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ మిత్రపక్షాలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై చర్చ జరగనుంది. ఈ పోస్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. గత రెండు పర్యాయాలు బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడంతో స్పీకర్ పోస్టును బీజేపీనే సొంతం చేసుకుంది. కానీ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకుంది. మిత్రపక్షాలతో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవిని జేడీయూ, తెలుగు దేశం పార్టీలు ఆశిస్తున్నాయి. కానీ స్పీకర్ పోస్టు మాత్రం తమ దగ్గరే అంటుపెట్టుకుని ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరికాసేపట్లో స్పీకర్ పోస్టుపై క్లారిటీ రానుంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహల్ గాంధీకి ఖర్గే బెదిరింపులు.. ఎందుకో తెలుసా..?
ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. ఇక ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపీకి అవకాశం దక్కింది. కేరళలోని మావెలికర నుంచి ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచిన కె.సురేష్‌కు అవకాశం దక్కింది. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము చేత ఈనెల 24న ప్రొటెం స్పీకర్‌గా సురేష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ఇది కూడా చదవండి: Nindha: కాండ్రకోట మిస్టరీనే ‘నింద’.. అస్సలు పోలిక ఉండదు: వరుణ్ సందేశ్ ఇంటర్వ్యూ
ఇదిలా ఉంటే ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఆ పదవి ఇవ్వకపోతే.. స్పీకర్ పోస్టుకు అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. అది జరిగితే స్పీకర్ పోస్టుకి ఎన్నిక జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.
ఇది కూడా చదవండి: Viral video: విహార యాత్రలో విషాదం.. కారు లోయలోపడి యువతి మృతి