White House Reaction: నోబెల్ శాంతి బహుమతిని సాధించాలని పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశ ఎదురైంది. ఆయన నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తు్న్నారు. ముందు నుంచి కూడా ఆ అవార్డుకు తనను తాను బలమైన పోటీదారుగా ట్రంప్ భావించారు. అమెరికా అధ్యక్షుడికి ఈ ఏడాది నోబెల్ బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ ఘాటుగా స్పందించింది.
READ ALSO: SS Rajamouli : రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా..?
రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిన కమిటి..
ట్రంప్‌కు నోబెల్ బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెయుంగ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి స్థాపన ప్రయత్నాలను నోబెల్ కమిటీ పూర్తిగా విస్మరించిందని ఘాటుగా స్పందించారు. నోబెల్ శాంతి బహుమతి రాకపోయినా అధ్యక్షుడు ట్రంప్ శాంతి కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు, యుద్ధాలను అంతం చేస్తారు, ప్రజల ప్రాణాలను కాపాడుతారని స్పష్టం చేశారు. ట్రంప్ గొప్ప మానవతా కరుణ కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు.
నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి నిరూపించిందని వైట్ హౌస్ ఘాటుగా స్పందించింది. చాలా కాలంగా ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని పిలుపునిస్తూ, నోబెల్ శాంతి బహుమతిని తాను పొందడానికి తనను తాను బలమైన పోటీదారుడిగా ప్రకటించుకున్నారు. ఇప్పటికే అనేకసార్లు ట్రంప్ ఏడు యుద్ధాలను ఆపానని, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం ద్వారా ఎనిమిదో యుద్ధాన్ని ఆపబోతున్నానని బహిరంగంగా ప్రకటించారు. పాకిస్థాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని లాబీయింగ్ చేశాయి. కానీ ట్రంప్‌కు మాత్రం ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విషయంలో మొండి చెయ్యి ఎదురైంది.
2025 నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, మానవ హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడోకు ప్రదానం చేయనున్నట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. గత 20 ఏళ్లుగా ఆమె ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి, శాంతియుత పరివర్తనను సాధించడానికి కృషి చేస్తున్నారు. శాంతి బహుమతిని ప్రకటిస్తూ నోబెల్ కమిటీ.. నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నియంతృత్వం పెరిగి ప్రజాస్వామ్యం బలహీనపడిన తరుణంలో మరియా మచాడో వంటి వ్యక్తుల ధైర్యం ఆశాజ్వాల లాంటిదని పేర్కొంది.
READ ALSO: Pakistan Crisis: పద్మవ్యూహంలో చిక్కిన పాకిస్థాన్ సైన్యం.. దాయది దారెటు!