NTV Telugu Site icon

Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..

Ordinance

Ordinance

Rahul Gandhi Disqualification: క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్‌ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ఆర్డినెన్స్‌ కాపీలో ఏముంది?. ఒకవేళ ఆ ఆర్డినెన్స్‌ కాపీని రాహుల్‌ చించకుండా ఉండుంటే ఇప్పుడు అనర్హత వేటు నుంచి తప్పించుకునే వాడా? అనే చర్చ జరుగుతోంది. వయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనలు సహా 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ స్పష్టం చేసింది. రాహుల్‌పై వేటు నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కారణంగా మరో చర్చ ప్రారంభమైంది. 2013లో రాహుల్​ గాంధీ ఆ ఆర్డినెన్స్​ విషయంలో అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Supreme Court: కొవిడ్ సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో లొంగిపోవాలి

2013లో ఆ ఆర్డినెన్స్ ఏంటి?
ప్రజా ప్రతినిధుల పనితీరుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్ష పడితే ఏం చేయాలన్నదానిపై ఆ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లో దోషిగా తేలితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హులవుతారు. శిక్షా కాలం పూర్తయ్యాక మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదు. అయితే.. ఒకప్పుడు ఈ చట్టంలోని నిబంధనలు మాజీ ప్రజాప్రతినిధులకు, సిట్టింగ్ సభ్యులకు వేర్వేరుగా ఉండేవి. మాజీ ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హులవుతారు. కానీ.. సిట్టింగ్​ సభ్యులకు మాత్రం దోషిగా తేలిన తర్వాత 3 నెలల పాటు సమయం ఉంటుంది. ఈలోగా పైకోర్టుకు అప్పీలుకు వెళ్లి, తీర్పు మారేలా చేసుకుంటే.. అనర్హత వేటు తప్పుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సర్కారు ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే 3 నెలల వరకు అనర్హత వేటు వేయరాదన్నది ఈ ఆర్డినెన్స్‌లోని ముఖ్యమైన అంశం. ఆ ఆర్డినెన్స్‌ కాపీనే రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంలో చింపేశారు. దీని వల్ల కొన్ని రోజుల తర్వాత మన్మోహన్‌ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హుల్ని చేసే నిబంధన అమలైంది. దాని వల్లే ఇప్పుడు రాహుల్‌ గాంధీపై వేటు పడింది.

 

Show comments